Justice Sanjeev Khanna | సుప్రీంకోర్టు తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కన్నా నియామకం అయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనే రెండో సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్.. తర్వాతి సీజేఐగా జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేశారు. కేంద్రం ఆమోదం తెలిపితే ఆయన నవంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఖన్నా పదవీకాలం 2025 మే 23 వరకు ఉంటుంది. అంటే దాదాపు ఆరున్నర నెలల పాటు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగే అవకాశం ఉంటుంది. నిబంధనల మేరకు సుప్రీంకోర్టు సీజేఐ తర్వాతి పేరును సూచించాలని కేంద్రం సీజేఐని అభ్యర్థించింది.
ఈ మేరకు డీవై చంద్రచూడ్ జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేశారు. ఆయనకు న్యాయవ్యవస్థలో మంచి పేరున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందకముందు ఢిల్లీ హైకోర్టులో పని చేశారు. జనవరి 18, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. జస్టిస్ ఖన్నా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హన్సరాజ్ ఖన్నా మేనల్లుడు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 14 మే 1960న జన్మించారు. ఆయన తండ్రి దేవరాజ్ ఖన్నా సైతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయన తల్లి సరోజ్ ఖన్నా ఎల్‌ఎస్‌ఆర్ డీయూలో లెక్చరర్‌గా పని చేశారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఢిల్లీలోని తీస్ హజారీ క్యాంపస్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో వివిధ రంగాల్లో ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. ఆ తర్వాత 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 నుంచి 2019 వరకు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తరువాత, జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకం విషయంలో వివాదం తలెత్తింది. వయసు, అనుభవం పరంగా ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఉన్నా ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తీసుకున్నారు.