న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి 53వ చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ ఎంపికవ్వనున్నట్లుగా సమాచారం. తదుపరి సీజేఐగా సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీ.ఆర్. గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను సాధారణంగా సీజేఐగా ఎంపిక చేస్తారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే.. 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 24న ప్రమాణం చేస్తారు.
ఈ ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా సమాచారం. జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు.
