CM KCR | దేశానికి ఆదర్శం.. తెలంగాణ వైద్యం: సీఎం కేసీఆర్‌

CM KCR మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దుతాం వైద్యశాఖపై విమర్శలు వస్తూనే ఉంటాయి కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి నిమ్స్‌ విస్తరణ శంకుస్థాపనలో సీఎం కేసీఆర్‌ గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్‌ల పంపిణీ షురూ విధాత, హైదరాబాద్‌ బ్యూరో: దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన […]

  • Publish Date - June 14, 2023 / 02:40 PM IST

CM KCR

  • మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దుతాం
  • వైద్యశాఖపై విమర్శలు వస్తూనే ఉంటాయి
  • కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • నిమ్స్‌ విస్తరణ శంకుస్థాపనలో సీఎం కేసీఆర్‌
  • గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్‌ల పంపిణీ షురూ

విధాత, హైదరాబాద్‌ బ్యూరో: దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, కరోనావంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు నర్సులు సిబ్బంది ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కులనుండి విమర్శలు వస్తుంటాయని, ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా… ప్రముఖ ప్రభుత్వ దవాఖాన ‘నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న ‘దశాబ్ధి వైద్య భవనా’ల్లో నూతనంగా 2000 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి రానున్నాయి.

అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని అభివర్ణించారు.

వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుందని, ప్రపంచంలో మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ‘డాక్టర్లు గొప్పవారు. మంచి మనసున్న వాళ్ళు. నిరుపేదలు వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు. అది వాస్తవం. కానీ పత్రికలు, జర్నలిస్టులు ‘ఉస్మానియాలో బెడ్లు లేవు. పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు’ అంటూ వక్రీకరణలు చేస్తారని అన్నారు.

న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సిఎం కేసీఆర్

గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కేసీయార్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు పార్వతి – ఉదయనగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్ కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్ కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్ నగర్ కు చెందిన సుజాతమ్మ, అంబెడ్కర్ నగర్ రేణుకమ్మ లకు న్యూట్రిషన్ కిట్లను సిఎం కేసీఆర్ లబ్ధిదారులకు అందచేశారు. కార్యక్రమం అనంతరం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సిఎం కేసీఆర్ కు లక్ష్మినరసింహ స్వామి జ్జాపికను అందచేశారు.

ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరక్టర్ గడల శ్రీనివాస్,

మెడికల్ హెల్త్ డైరక్టర్ రమేశ్ రెడ్డి, టిఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిఎం వోఎస్డీ గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, నిమ్స్ డైరక్టర్ బీరప్ప, పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్,వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News