PAN–Aadhaar Linking Deadline December 31, 2025: Penalty, ITR Issues Explained
జరిమానా, ITR సమస్యలు, రిఫండ్ ఆలస్యం తప్పవా?
విధాత బిజినెస్ డెస్క్ | హైదరాబాద్:
PAN–Aadhaar Linking | | పన్ను చెల్లింపుదారులు ఒక కీలక జాగ్రత్త తసుకోవాల్సిఉంది. పాన్ కార్డు–ఆధార్‌లను ఇంకా లింక్ చేయకపోతే వెంటనే చేయాలి. లింక్ ప్రక్రియను డిసెంబర్ 31, 2025లోపు పూర్తి చేయకపోతే తీవ్ర ఆర్థిక, పన్ను సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(Central Board of Direct Taxes – CBDT) తప్పనిసరి చేసింది.
ఏప్రిల్ 3, 2025న విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ 1, 2024కు ముందు ఆధార్ ఆధారంగా పాన్ కార్డు పొందిన వారు తప్పనిసరిగా తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. నిర్ణీత గడువు దాటితే 2026 జనవరి 1 నుంచి ఇక పాన్ చెల్లుబాటు కాదు.
తాజా CBDT ఆదేశాల్లో ఏముంది?
ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ కార్డు పొందిన వారికి ఈ నిబంధన ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇలాంటి వారు ఇప్పుడు అసలైన ఆధార్ నంబర్‌తోనే పాన్ లింక్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఇది చేయకపోతే పాన్ పనిచేయకుండా పోతుంది.
పాన్ చెల్లుబాటు కాకపోతే —
- ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేరు.
- పన్ను రిఫండ్‌లు నిలిచిపోతాయి.
- బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్ల సేవలు నిలిపివేసే అవకాశం ఉంది.
- టిడిఎస్ / టిసిఎస్ అధికంగా కట్ అవుతుంది.
- 15G, 15H వంటి ఫారాలు తిరస్కరణకు గురవుతాయి.
జరిమానా ఉందా? పాత గడువుల సంగతి ఏంటి?
ఇంతకుముందు పాన్–ఆధార్ లింకింగ్‌కు జూన్ 30, 2023 గడువు ఉండగా, తర్వాత మే 31, 2024 వరకు పొడిగించారు. ఆ సమయంలో రూ.1,000 ఆలస్య రుసుము విధించారు.
అయితే తాజా గడువు పరిధిలోకి వచ్చే వారు (ప్రస్తుత నోటిఫికేషన్‌లో పేర్కొన్నవారు) డిసెంబర్ 31, 2025లోపు లింక్ చేస్తే జరిమానా ఉండదు. కానీ పాత గడువులు మిస్ అయిన ఇతర పాన్ హోల్డర్లు సెక్షన్ 234H కింద రూ.1,000 ఫీజు చెల్లించాల్సి రావచ్చు.
పాన్–ఆధార్ లింకింగ్ ఎందుకు అంత కీలకం?
పాన్ లేకుండా బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్లు, ఆస్తి లావాదేవీలు, పెద్ద మొత్తాల నగదు లావాదేవీలు దాదాపు అసాధ్యం. ముఖ్యంగా రిటర్న్ ఫైలింగ్, రిఫండ్‌ల విషయంలో పాన్ చెల్లుబాటులో లేకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.
ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు
ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా పాన్–ఆధార్ లింకింగ్‌ను చాలా సులభంగా చేసింది. చివరి నిమిషంలో టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడే మీ పాన్–ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ అయి ఉండటం కూడా అవసరం.
