విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పడకేసిన నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ సర్కార్ మళ్ళీ నిద్ర లేపింది. జల జీవం లేని ఈ పథకానికి కొత్త ప్రభుత్వం జీవ కళ ఉట్టిపడే విధంగా ప్రకటన చేసింది. ఈ పథకాన్ని గత బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కృష్ణా నది జలాలతో కొడంగల్ నియోజకవర్గ ప్రజల కాళ్లు కడుగుతానని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. జనం నెత్తిన నీళ్లు చల్లారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ఈ పథకాన్ని అటకెక్కించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా మాత్రమే వాడుకున్నారు. నేటికీ ఈ పథకం అమలుకు ఇచ్చిన జీవో 69 ని మూలకు పడేసారు. కొడంగల్ కు వచ్చిన ప్రతీసారి అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ‘ఎత్తిపోతల’పై ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు.
సత్వరమే ప్రారంభించి కొడంగల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రగల్భాలు చెప్తూ ప్రజలను నమ్మించి, కాలయాపన చేశారు. ఈక్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం కావడంతో ఈ పథకానికి జల జీవం పోసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొడంగల్-నారాయణ పేట ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. లక్షా ఐదు వేల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తామనీ ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలిఅడుగు వేస్తోంది.
చెంతనే కృష్ణా నది ఉన్నా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీరందని మెట్ట ప్రాంతాల రైతుల చిరకాల స్వప్నం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఆ కలను సాకారం చేయాలని, ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లో జీఓ జారీ చేసినా అమలుకు నోచుకోలేదు. ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు చేపట్టినా ఫలితం దక్కలేదు. పదేళ్ల పాటు మరుగున పడిన ఎత్తిపోతల అంశం.. ఎన్నికల హామీగా మరోసారి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా పరుగులు తీసే కృష్ణానది, నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద తెలంగాణ రాష్ట్రoలోకి ప్రవేశిస్తుంది.
తెలంగాణలో కృష్ణమ్మ అడుగు పెట్టేది నారాయణ పేట జిల్లాలోనే అయినా, ఈ జిల్లా ఎగువ ప్రాంతాలకు ఇప్పటికే కృష్ణా జలాలు అందడం లేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందిస్తామని అప్పటి తెరాస సర్కార్ హామీ ఇచ్చింది. తొమ్మిదేళ్ళు పూర్తయినా చుక్క నీరు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పథకంతో నారాయణ పేట-కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ వైపు అడుగులు వేసేoదుకు సిద్ధమవుతున్నారు.
కోయిలకొండ జలాశయం రూటు మారింది..
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇప్పటికే జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. కానీ మక్తల్, నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందడం లేదు. ఈ పథకాల ద్వారా ఈ ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం లేదు. అందుకే భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్ పూర్ జలాశయం నుంచి నాలుగు దశల్లో కానుకుర్తి వరకు నీళ్లు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా దౌల్తాబాద్, కొడంగల్ మీదుగా బొంరాస్ పేట వరకు చెరువులు నింపి.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు.
ఈ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం పరిశీలించి, మొదటి దశ కింద రూ.133.50 కోట్లను పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.3.36 కోట్లు ప్రాథమిక సర్వే కోసం, రూ.130.14 కోట్లు భూ సేకరణ కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే అమలు కోసం 2014 మే 23న జీవో 69ని జారీ చేశారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ నీటిని నర్వ మండలం ఎల్లంపల్లి మీదుగా నీటిని ఎత్తిపోసి కోయిలకొండ మండలం వద్ద జలాశయం నిర్మించి అక్కడ నీటిని నిలువ చేసి నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలకు నీరు తరలించాలని అంచనా వేశారు.
ఈ ప్రకారమే అధికారులు సర్వే పనులు చేపట్టారు. జలాశయం నిర్మించే ప్రాంతం కోయిలకొండ వద్ద జెండాలు కూడా పాతారు. పనులు సత్వరమే ప్రారంభించేందుకు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక పరిశీలించిన అప్పటి తెరాస సర్కార్ ముంపు ప్రాంతం అధికంగా ఉందని గుర్తించింది. ఇది ఆచరణకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రణాళికను పూర్తిగా మార్చివేసింది. దీంతో నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని ప్రభుత్వం భావించింది.
కేసీఆర్ పై భగ్గుమన్న సంఘాలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటనను ఇక్కడి ప్రజా సంఘాలు పూర్తిగా వ్యతిరేకించాయి. జలసాధన సమితి సభ్యులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నాయి. అప్పట్లోనే భూత్పూర్ జలాశయం నుంచి ఆయా మండలాల మీదుగా కొడంగల్ వరకు పాదయాత్ర చేపట్టారు. తద్వారా ఆయా గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించి, జీవో 69పై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ జీవోను అమలు చేస్తేనే ఈ ప్రాంతాలకు సాగునీరు వస్తుందనే విషయాన్ని నొక్కిచెప్పారు.
రేవంత్ రెడ్డి హామీతో ఈ పథకం గట్టెక్కేనా..
మక్తల్, నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు శ్రీకారం చూడుతుందా అని ఈ ప్రాంత రైతాంగం ఎదురుచూస్తోంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్ని కల ప్రచారంలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే నారాయణ పేట ఎత్తిపోతల పథకంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
హామీ ఇచ్చిన విధంగా ఈ పథకం పూర్తి చేయాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం పూర్తి చేయాలంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగాల్సిన పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును నమ్ముకుంటే నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం మళ్ళీ పడికేసినట్లే అని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. 69 జీవో ప్రకారం ముందుకు వెళితే ఈ ప్రాంతాలకు అనుకున్న విధంగా నీళ్లు వస్తాయని జలసాధన సమితి నేతలు అంటున్నారు. ఆ వైపు రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.