ప్రజల వద్దకు పాలనకే ప్రజాపాలన సభలు: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Publish Date - December 27, 2023 / 10:38 AM IST

  • రేప‌టి నుంచి అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ
  • ప్రజాపాలన లోగో.. దరఖాస్తు పత్రం ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
  • రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
  • టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు


విధాత: నిస్సాహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని..తండాలు గూడెల్లో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు సహాయం అందించేందుకు ఈ ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజాపాలన లోగోను, అభయ హస్తం పథకాల దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.


ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామ, పట్టణ వార్డు సభల్లో ప్రజలు అభయ హస్తంలోని అభయ హస్తం ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా తెలిపారు. ప్రజలకు ముందే దరఖాస్తు ఫారాలు పంపించి , దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించామన్నారు.


కలెక్టరేట్‌లకు, ప్రజాభవన్‌ ప్రజావాణికి రాకపోకల ఖర్చులు భరించి వచ్చి పథకాల కోసం దరఖాస్తులు చేయడం అందరికి సాధ్యం కాదని అందుకే ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు ప్రజాపాలన సభల ద్వారా పంపిస్తున్నామన్నారు. ఇంతకాలం గడిల మధ్య సాగిన పాలనను ఇప్పుడు ప్రజలకు ముందుకు తెస్తామన్న మాట మేరకు ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి మండల అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం రోజుకు రెండు గ్రామ, పట్టణ వార్టు సభలు నిర్వహిస్తుందన్నారు.


జనవరి 7లోగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి పథకాల అమలులో ప్రణాళిక రూపొందించుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టి అర్హులైన అందరికి ఆరుగ్యారంటీలు అందిస్తామన్నారు. జనభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో అదనపు కౌంటర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తామన్నారు. తెల్ల రేషన్‌ కార్డు ప్రమాణికంగా పథకాల అమలు చేపడుతామని ఇందులో రేషన్‌ కార్డు లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరంగా రేషన్‌ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.


గ్రామ, వార్డు సభలో దరఖాస్తులు ఇవ్వలేని వారు తర్వాతా పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందించవచ్చని సీఎం తెలిపారు. ప్రజాపాలన సభల్లో ఆరు గ్యారంటీలతో పాటు ఇతర అన్ని రకాల సమస్యలపై కూడా దరఖాస్తులు అందించవ్చని స్పష్టం చేశారు. దరఖాస్తులను అనుసరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం జరిగేలా చూస్తామన్నారు. మీడియా ప్రతినిధులు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా, సమస్యల పరిష్కార సారధులుగా ఉండాలని త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


లక్ష కోట్లలో కేటీఆర్‌ లక్ష మాత్రమే చెల్లించారు


ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసిందని, బాధిత మహిళకు ఆయన లక్ష సాయం అందించారని ఆ రకంగా చూస్తే మా ప్రజావాణి విజయవంతమైట్లేనన్నారు. కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష మాత్రమే ఇచ్చారని, మిగతా దోపిడి సొమ్మంతా ప్రజలకు చేరేదాక వదలబోమన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులు దోచుకుతిన్న సొమ్ము ప్రజల రక్తపు కూడని రేవంత్‌ వ్యాఖ్యానించారు.


నేను ముందే చెప్పానని మేనేజ్‌ మెంట్‌ కోటాలో వచ్చిన కేటీఆర్‌కు ఏం తెలువదని, అధికారం పోయిందన్న బాధతో కల్తీకల్లు తాగినోడిలెక్కన పిచ్చోడి మాదిరిగా ఆగమాగంగా మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో బీఆరెస్‌ సభ్యులకు వారు అడిగినంత సమయం మాట్లాడే అవకాశం కల్పించామని, అక్కడ చెప్పుకోలేని మాటలు ఇంటికెళ్లి స్వేద పత్రం పేరుతో చెప్పుకున్నాడన్నారు. సభలో బావబామ్మర్ధుల తాపత్రాయం..ఆరాటం. పోరాటం తప్ప ఆ పార్టీ సభ్యులెవరు వారితో కలిసి రాలేదని, మాట్లాడలేదన్నారు.


గత ప్రభుత్వ హయాంలో 22 కొత్త కార్లు కొని విజయవాడలో దాచి పెట్టారని, మూడోసారి అధికారంలోకి వస్తే వాటిని వాడుదామనుకున్నారని, ఆ కార్ల సంగతి తెలియడానికి సీఎంగా నాకే వారం రోజులు పట్టిందన్నారు. వాళ్లవి ప్రజల రక్తం పిండి సంపాదించిన ఆస్తులని, ప్రజలకు ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం, చత్తీస్‌ ఘడ్‌ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఫ్లాంట్లపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు.


ఖాజనా ఖాళీ చేసేశారు..


లంక బిందెలనుకుని అధికారంలోకి వస్తే ఖాళీ కుండల మాదిరిగా ఖజనాను బీఆరెస్‌ పాలకులు ఖాళీ చేసేశారని, పథకాల అమలుకు నిధుల సమీకరణపై ఇప్పుడు మాకు సవాల్‌గా మారిందన్నారు. అయినా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసి తీరుతామన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, 6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారన్నారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.


కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతామన్నారు. బీఆరెస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మాకు బుల్లెట్‌ ట్రైన్‌పై సలహా ఇస్తున్నాడని, పదేళ్లు అధికారంలో ఉండి వరంగల్‌ సైనిక స్కూల్‌, ఐటీఐఆర్‌ మధ్యలో ఎందుకు రద్దయ్యాయో ముందుగా ఆయన సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మేం ఇచ్చిన హామీల అమలు తీరు పరిశీలనకు బీఆరెస్‌ షాడో టీమ్‌లు పెడుతామని కేటీఆర్‌ అన్నారని, అసెంబ్లీలో కావాల్సినంతా సేపు మైక్‌ ఇచ్చామని ఇంకా షాడోలు ఎందుకని ఎద్దేవా చేశారు.


కేటీఆర్‌, హరీశ్‌రావుల దంచుడు ఖాళీ రోళ్లలో దంచుడు కథ మాదిరిగా ఉందన్నారు. అప్పుడే ఏం అయ్యిందని, మేమొచ్చి 30రోజులు కూడా కాలేదని, ముందుంది ముసళ్ల పండుగన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన పరిష్కారం పర్యవేక్షణకు ఒక ఐఏఎస్‌ అధికారిని, ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. మండల స్థాయి దరఖాస్తులు నేరుగా సీఎం ప్రజావాణికి వచ్చినప్పుడు వాటిని క్షేత్ర స్థాయికి పంపించి పరిష్కారం చేయడంలో సమయడం తప్పదన్నారు.


రైతుబంధుకు ఎలాంటి పరిమితి పెట్టలేదు


రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విదించలేదని, ఆలస్యమైనా అందరికి రైతుబంధు నిధులు అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత ఎల్ అండ్ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఆ నిధులు ఉపయోగపడుతాయన్నారు.


ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం


టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని, టీఎస్ పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామని, అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. గ్రూప్-2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Latest News