విధాత: కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్గ విభేదాలు ఆదివారం రచ్చ కెక్కాయి. తిరుమలగిరి మండల కేంద్రంలోని ఒక తోట సమీపంలో అద్దంకి దయాకర్ వర్గీయులు తుంగతుర్తి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం 200 మందితో ఏర్పాటు చేశారు.
సమావేశానికి వచ్చే కార్యకర్తల కోసం టెంట్లు, కుర్చీలు, భోజన వసతి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి వర్గీయులు తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షుడు వై.నరేష్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకొని అద్దంకి వర్గీయుల సమావేశ ఏర్పాట్లను చెల్లా చెదురు చేసి సమావేశాన్ని భగ్నం చేశారు.
ఎన్నికలు వస్తున్నాయనగానే వచ్చే నాయకుడు అద్దంకి దయాకర్ అంటూ విమర్శిస్తూ ఆయన వర్గీయులు ఇక్కడ సమావేశం పెట్టకూడదని అడ్డుకున్నారు. సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంటులను తొలగించి, సిద్ధం చేసిన భోజనాలను పారవేశారు. చేసేది లేక అద్దంకి దయాకర్ వర్గీయులు అన్ని సర్దుకొని వెనుతిరిగి వెళ్లిపోయారు.
అనంతరం నాగారం మండలం పణీగిరి గ్రామ శివారులోని చెట్టుకింద వండిన భోజనాలను వచ్చిన కార్యకర్తలకు పెట్టి వెళ్లిపోయారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు వచ్చారు.
అద్దంకి దయాకర్ వర్గీయుల సమావేశాన్ని దామన్న వర్గీయులు భగ్నం చేసిన ఘటనతో తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు మరోసారి రోడ్డున పడ్డట్టు అయింది. సమావేశాన్ని భగ్నం చేయడం ద్వారా దామోదర్ రెడ్డి తన పర్యవేక్షణలోని సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న రేవంత్ వర్గీయులైన పటేల్ రమేష్ రెడ్డికి, అద్దంకి దయాకర్ కు, రేవంత్ కు నేరుగా తన అసమ్మతిని తెలియజేసినట్లు అయింది.
కాగా తమ సమావేశాన్ని దామోదర్ రెడ్డి వర్గీయులు భగ్నం చేయడం పట్ల అద్దంకి దయాకర్ వర్గీయులు విలేకరులతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం ప్రాంతంలోని కార్యకర్తలతో పెట్టుకున్న సమావేశాన్ని దామోదర్ రెడ్డి వర్గీయులు భగ్నం చేసిన తీరు వారి దౌర్జన్యానికి నిదర్శనమని విమర్శించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోకి కాంగ్రెస్ నాయకులను ఎవరిని రానీయకుండా దామోదర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి జోక్యం ఎందుకంటూ ప్రశ్నించారు. అద్దంకి దయాకర్ వర్గీయుల సమావేశం కోసం వచ్చిన వారిలో ఎండి.నవాబు, లావుడియా మహేష్, చిరంజీవి, సతీష్, అఖిల్, బిక్కు, శీను, యాదగిరి, యాకస్వామి, వీరయ్య, శీను ఉన్నారు.