Congress | వంద రోజుల రూట్‌మ్యాప్‌.. ఆగస్టు 15 నుంచి నేతల బస్సుయాత్ర

Congress | ఆ ఐదు పథకాలే ప్రధాన అజెండా అధికార సాధనకు కాంగ్రెస్‌ ప్లాన్‌ రెడీ ఆగస్టు 15 నుండి నేతల బస్సుయాత్ర ప్రధాన పథకాలతో పాటు.. 30% కమీషన్‌ సర్కార్‌ నినాదం విస్తృతంగా జనంలోకి ప్రియాంక సభ.. డిక్లరేషన్‌లపై చర్చ పార్టీ బలాబలాలపై సునీల్ నివేదిక విధాత: తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 15 నుండి బస్సు యాత్రల ద్వారా కాంగ్రెస్ ఫ్లాగ్‌షిప్ […]

  • Publish Date - July 23, 2023 / 03:14 PM IST

Congress |

  • ఆ ఐదు పథకాలే ప్రధాన అజెండా
  • అధికార సాధనకు కాంగ్రెస్‌ ప్లాన్‌ రెడీ
  • ఆగస్టు 15 నుండి నేతల బస్సుయాత్ర
  • ప్రధాన పథకాలతో పాటు.. 30% కమీషన్‌ సర్కార్‌ నినాదం విస్తృతంగా జనంలోకి
  • ప్రియాంక సభ.. డిక్లరేషన్‌లపై చర్చ
  • పార్టీ బలాబలాలపై సునీల్ నివేదిక

విధాత: తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 15 నుండి బస్సు యాత్రల ద్వారా కాంగ్రెస్ ఫ్లాగ్‌షిప్ పథకాలైన 4వేల పింఛన్‌, 2 లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పేదల ఇళ్లకు 5 లక్షల సాయం, 500లకే సిలింండర్‌లతోపాటు.. పార్టీ ఎన్నికల హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వీటితోపాటే కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలో ఎండగట్టాలని తీర్మానించింది.

కొంత కాలంగా కాంగ్రెస్‌ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కాంట్రాక్ట్‌లో 30% కమీషన్‌ తీసుకుంటున్నదని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని నిర్ణయించారు. ఇందుకు వంద రోజుల కార్యచరణకు రూపకల్పన చేయాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది.

ఆదివారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు కే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జీలు, పీఏసీ సభ్యులు, అనుబంధ సంస్థల ముఖ్యులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాబోయే వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, బస్సు యాత్ర విధి విధానాలపైన చర్చించారు. నేతల మధ్య సమన్వయం, కొత్త వారి చేరికలపైన, త్వరలో నిర్వహించాల్సిన ప్రియాంకగాంధీ సభ, బీసీ, మహిళా డిక్లరేషన్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితిగతులపైన, బలాబలాపైన, వ్యూహకర్త సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్టీలో చేరికలు, కొత్తగా పార్టీలోకి వచ్చే వారితో లాభాలు, పాతవారు బయటకు వెళ్తే జరిగే నష్టాలపై ఆయన నివేదించారు. దీనిపై పీఏసీ లోతైన చర్చ నిర్వహించింది.

30న కొల్లాపూర్‌లో ప్రియాంక సభ

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మధుయాష్కి.. ఈ నెల 30న కొల్లాపూర్‌లో సభ నిర్వహిస్తున్నామని, దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. ఈ సభలో మరికొన్ని డిక్లరేషన్లు వెల్లడిస్తామని చెప్పారు.

పెండింగ్‌ డిక్లరేషన్లపైనా సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగస్ట్ 15న కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు.

బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు చేసేందుకు సబ్‌కమిటీని నియమించామని చెప్పారు. తాము ఖమ్మం సభలో దివ్యాంగులకు 4వేలు పెన్షన్‌ ఇస్తామని ప్రకటించడంతోనే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను పెంచక తప్పలేదని అన్నారు.

Latest News