విధాత : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆరెస్‌కు లోక్ సభ ఎన్నికల్లోనూ మరోసారి బిగ్ షాక్ తప్పదని ఈ సర్వే వెల్లడించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా ఓట్ల శాతం పెంచుకుని 8 సీట్లు గెలిచిన బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గతంలో మాదిరిగా 4 సీట్లు కూడా రావడం కష్టమేనని సర్వే తెలిపింది.
లోకసభ ఎన్నికలపై ఏబీపీ-సీ-ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ విడుద చేసిన సర్వేలో తెలంగాణలో 17 లోకసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. బీఆరెస్ 3 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. బీజేపీకి 1నుంచి 3 స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వే తెలిపింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని పేర్కోంది. గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 3, బీఆరెస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 1 సీటు గెలుచుకున్నాయి.