విధాత: రాష్ట్రంలో భూ రికార్డుల సవరణ కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ బృందం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది, భూమి వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ టర్కిని కలిసి వినతి పత్రం అందించారు.
భూ రికార్డులను నవీకరించి అందరికి నూతన పాస్ పుస్తకాలు ఇచ్చే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ రికార్డుల సవరణ( ఎల్ ఆర్ యూపీ) కార్యక్రమాన్ని చేపట్టిందని బృందం సభ్యులు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు వేనారెడ్డి అజయ్ టర్కికి తెలిపారు.
సమగ్ర విచారణ పేరుతో జరిగిన ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో అనేక అవకతవకలు జరిగాయని ఆయనకు వివరించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అనేక భూములు నిషేధిత జాబితాలో పడ్డాయని, మరి కొన్ని భూముల సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని తదితర విషయాలపై సమ్రగంగా విచారణ చేయాలని వారు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిని కోరారు.
టీ పీసీసీ బృందం ఇచ్చిన వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన అజయ్ టర్కి త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు కోదండరెడ్డి తెలిపారు.