హంగ్ రాదు.. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఖాయం: సీపీఐ నారాయణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి విశ్లేషిస్తే రాష్ట్రంలో హంగ్‌కు అవకాశం లేదని, పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు

  • Publish Date - December 1, 2023 / 08:49 AM IST
  • అహంభావం ఓడిపోతుంది…ప్రజాస్వామ్యం గెలుస్తుంది
  • నియంత కేసీఆర్ కంటే ఐదుగురి సీఎంలే నయం
  • బీఆరెస్‌కు మేలు చేసేందుకు జగన్ జల జగడం
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి విశ్లేషిస్తే రాష్ట్రంలో హంగ్‌కు అవకాశం లేదని, పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని బోగస్ అంటూ మంత్రి కేటీఆర్, కవితలు చేసిన వ్యాఖ్యలు దింపుడు కల్లం ఆశలేనన్నారు.


గతంలో చంద్రబాబు కూడా ఇదే రీతిలో మాట్లాడి భంగపడ్డారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామం గెలుస్తుందని, అహంభావం ఓడిపోతుందన్నారు. పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి, అహంకారం కవల పిల్లల మాదిరిగా సాగాయని, కనీసం పోటీ పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య పాలన సాగిందన్నారు. ధరణి పెద్ద కుంభకోణంగా మారిందన్నారు.


ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగించడంతో ప్రజలకు కేసీఆర్ ను తిప్పి కొట్టారని, యువత, దళిత వర్గాలు కేసీఆర్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఈసారి పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని కేసీఆర్ అభివృద్ధి జరిగిందని చెప్తున్నా హైద్రాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువ ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు.


డిసెంబర్ 3ఫలితాల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించబోతుందని, ఆ పార్టీకి క్యాంపు రాజకీయాలు అవసరం లేదన్నారు. ఏ అసెంబ్లీ నుంచి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని గతంలో సస్పెండ్ చేశారో అదే రేవంత్‌రెడ్డిని నేడు శాసన సభ పక్ష నేతగా స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడిగా ఉండాలన్నారు.


ఐదేళ్ళ పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతోందని, కేసీఆర్ లాంటి నియంత కంటే.. ఐదేళ్ళల్లో ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా ఫర్వాలేదని, ప్రజాస్వామం బతికే ఉంటుందన్నారు. కొత్తగూడెంలో సీపీఐ కూనంనేని సాంబశివరావు, సిర్పూర్‌లో బీఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు విజయం సాధించి అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అహంభావంతోనే ఓడిపోతున్నారన్నారన్నారు.


కాంగ్రెస్‌-సీపీఐల కూటమి ఓట్ల బదిలీ సఫలీకృతమైందని, కొత్తగూడెంలో సీపీఎం మాకు సహకరించిందన్నారు. తెలంగాణ సంపద పెంచామని కేసీఆర్ చెప్పుకోవడంలో నిజమేమోగాని, కల్వకుంట్ల ఖజానా మాత్రం పెరిగిందన్నారు. తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకొని నాగార్జున్ సాగర్ వద్ద జగన్‌ ప్రభుత్వం నాటకం ఆడిందని నారాయణ ఆరోపించారు.


కేసీఆర్ ను గెలిపించడం కోసం జగన్ కుట్రపన్నారన్నారు. ఇన్నాళ్లు ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన జగన్‌కు ఇప్పుడే నీళ్లు ఎందుకు గుర్తొచ్చాయని నిలదీశారు. జగన్ కుటిన రాజకీయ ప్రయత్నాలు బెడిసికొట్టాయని తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా వ్యవహారించి ప్రలోభాలను అధిగమించి మార్పు కోరి కాంగ్రెస్‌ను ఆదరించారన్నారు.