విధాత : ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్ చోటు చేసుకున్నది. సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని రాయుడు ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. డిసెంబర్ 28న వైసీపీలో చేరిన చెన్నై సూపర్ కింగ్స్ వికెట్‌కీపర్/బ్యాటర్ అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్రా పేరిట ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 45 రోజులపాటు సాగే క్రీడోత్సవాలకు అంబటిని బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు.
రాజీనామా నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో అంబటి రాయుడు పాల్గొనే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన అంబటి రాయుడు.. పార్టీలో చేరడానికి ముందే పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నారు. అయితే.. చేరిన ఎనిమిది రోజుల్లోనే ఎందుకు రాజీనామా చేశారన్నది ఆసక్తికరంగా మారింది. అంబటి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అకస్మాత్తుగా రాయుడు రాజీనామా వెనుక కారణాలేమిటన్న అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
2023 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై చెప్పాడు. రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపాడు. 38 ఏళ్ల రాయుడు.. భారత జట్టు తరఫున 55 వన్డే మ్యాచ్‌లు, 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో రాయుడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.