Site icon vidhaatha

Darwin’s theory of evolution | పుస్తకాల్లో డార్విన్‌ పరిణామ సిద్ధాంతానికి చెల్లు.. మత విశ్వాసాలకు భిన్నంగా ఉండటం వల్లేనా? చరిత్రపై కాషాయం కత్తి – 3

Darwin’s theory of evolution

Darwin’s theory of evolution । డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాలలో నుండి తొలగించడంతో ప్రకృతి, మొక్కలు, జంతువుల పరిణామ క్రమంలో ప్రతిపాదించిన ముఖ్యమైన సిద్ధాంతం కనుమరుగైంది. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే పరిశోధన ఫలితాలను మన విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేశారు.

డార్విన్‌ రూపొందించిన పరిణామ సిద్ధాంతం అంతకు ముందున్న వివిధ సిద్ధాంతాలకు కొత్త దారి చూపింది. జీవ, మానవ పరిణామ క్రమానికి నూతన భాష్యం చెప్పింది. అంతకు పూర్వం ఉన్న ఊహాజనిత విశ్లేషణలకు ఆధారాలతో కూడిన పరిశోధనల ద్వారా ముగింపు పలికింది. డార్విన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు తర్వాత జరిగిన పరిశోధనల్లో నిలబడకపోవచ్చు.

కానీ ఆయన చేసిన పరిశోధన కృషి, శాస్త్రీయ పద్ధతి వలన కొన్ని అంశాలు ఇప్పటికీ సహేతుకంగా నిలబడ్డాయి. ఆ విధంగా ఆయన చేసిన కృషి జీవశాస్త్ర పరిణామ అధ్యయనానికి ఎంతో ఉపయోగపడింది. సమకాలీన ప్రపంచంతో పోటీపడి భారతీయ విద్యార్థులు యువకులు శాస్త్రీయంగా ముందుకు నడవడానికి ఇలాంటి పరిశోధన పాఠ్యాంశాలు అవసరం.

NCERT | దేశ చరిత్రపై కాషాయ కత్తి.. పాఠ్యాంశాల నుంచి కీలక అంశాల తొలగింపు

డార్విన్‌ సిద్ధాంతాలతో విస్త్రత పరిశోధనలు

డార్విన్ జాతుల పుట్టుక అనే గ్రంథంలో అనేక శాస్త్రీయ అంశాలను ప్రతిపాదించాడు. తను ఒక్కడే కాకుండా ఇతర శాస్త్రవేత్తలతో కలిసి చేసిన పరిశోధనలు కూడా తర్వాత ప్రచురణలలో పొందుపరిచాడు. థామస్ హాక్సలే, జోసెఫ్ హుకర్, రస్సెల్ వాలేస్ మొదలైన ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చించాడు. డార్విన్ చెప్పిన విషయాల ద్వారా ఆ కాలంలో జీవశాస్త్ర, భౌగోళిక శాస్త్ర విభాగాలకు అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఫలితంగా ఆయా రంగాలలో పరిణామ సిద్ధాంతం పై విస్తృత పరిశోధనలు జరిగాయి.

ఈ పరిశోధనలకు ప్రేరణగా నిలిచింది డార్విన్ సిద్ధాంతం. ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం అప్పటివరకు ప్రజల్లో నెలకొని ఉన్న మతపరమైన మూఢ నమ్మకాలు పటాపంచలు చేసింది. జీవుల పుట్టుక, మనుగడకు సంబంధించి బైబిల్ చెప్పిన అంశాలన్నీ సరి అయినవి కావని రుజువు చేసింది. దేవుడే అన్నింటినీ సంరక్షిస్తాడు, పోషిస్తాడు అనే భావన తప్పు అని నిరూపించింది. ప్రకృతి వరణ (నేచురల్ సెలక్షన్ థియరీ) సిద్ధాంతం ద్వారా భూమిపై నివసించే మొక్కలు,జంతువులు అన్నింటినీ ప్రకృతి ఎంపిక చేస్తుందని ప్రతిపాదించాడు.

పాలకులకు నచ్చని ‘మనుగడ కోసం పోరాటం’

ప్రకృతి వరణ సిద్ధాంత ప్రకారం వివిధ జాతుల జీవులలో ఆకస్మికంగా మ్యుటేషన్స్ సంభవిస్తాయి. ఈ జన్యుపరమైన మార్పుల వల్ల జీవులలో వచ్చే భౌతిక మార్పులు అంతకు పూర్వం ఉన్న అదే జాతి జీవుల కంటే అధిక ప్రయోజనం కలిగి ఉంటే ఆ జీవులు అభివృద్ధి చెందుతాయి. లేదంటే ఆయా లక్షణాలు గల జీవులు నశిస్తాయి. ఈ ఎంపిక చేయడం లేదా నశించడం అనేది ప్రకృతిలో ఉండే వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించాడు.

ఇక్కడ దేవుడు, మతవిశ్వాసాలకు బదులుగా ప్రకృతి, పర్యావరణం మాత్రమే ఆయా జీవుల యొక్క మనుగడను నిర్ణయిస్తాయి. ఆయన సిద్ధాంతంలో ప్రతిపాదించిన మరొక రెండు అంశాలు జీవులలో వైవిద్యం, మనుగడ కోసం పోరాటం (స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్ట్రెన్స్). ఇవి రెండూ నేటి పాలకులకు నచ్చినట్టు లేవు. వైవిధ్యం లేని దేశం ఉండదు, మనుగడ కోసం పోరాటం చేయకుండా ప్రకృతిలో ఏ జీవి బ్రతకలేదు. ఇవి రెండూ కూడా సహజ సూత్రాలు, ప్రకృతి న్యాయాలు. వాటిని నిరాకరించడం అంటే వాస్తవాలను స్వీకరించలేకపోవడమే.

ప్రకృతిలో సహజంగా ప్రతి జీవి ఆహారం కోసం, ఆశ్రయం కోసం, సహజీవనం చేసే మరొక జీవి కోసం పోరాటం చేస్తుంది. ఆహారం కోసం జరిగే పోరాటం శాకాహార జంతువుల మధ్య ఒక విధంగా ఉంటే, మాంసాహార జంతువుల మధ్య ఉన్న పోరాటం మరొక రకంగా ఉంటుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన లేకపోతే మానవ జీవన క్రమంలో ఎదురయ్య ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి ఉండదు.

నేటి విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత విద్యారంగానిది. విద్యా వ్యవస్థలో రాజకీయ,మతపరమైన జోక్యం వల్ల ఆశాస్త్రీయమైన ధోరణలు పెరుగుతాయి. పాఠ్యాంశాలలో శాస్త్రీయ ధోరణులు తొలగిస్తే విద్యార్థులలో ఆధునిక భావాలు పెంపొందే అవకాశమే లేదు. అవి విద్యావ్యవస్థను సమకాలీన ప్రపంచం నుండి వెనక్కి తీసుకెళ్తాయి.

NCERT | ప్రజల చరిత్రకు పాతర.. విద్యార్థులపై అవాస్తవాలు రుద్దే యత్నం | చరిత్రపై కాషాయం కత్తి- 2

ఇలాగైతే ప్రపంచంలో అగ్రస్థానం సాధ్యమా?

రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెడతామని ప్రకటిన్నారు పాలకులు. ఈ విధంగా పాఠ్యాంశాలలో శాస్త్రీయ పరిణామ ఘట్టాలను తొలగిస్తే రానున్న కాలంలో శాస్త్ర విజ్ఞాన రంగంలో మన విద్యార్థులు ఏ విధంగా రాణిస్తారు అంచనా వేయవచ్చు. జీవశాస్త్ర పాఠ్యాంశాలే కాకుండా చరిత్ర, పౌరనీతి శాస్త్రాల్లో కూడా ఈ విధమైన ధోరణిలోనే పాఠ్యాంశాల ఎంపిక తొలగింపు జరుగుతున్నది.

విద్యార్థులు సైన్సు,చరిత్ర, ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలైన విషయాలలో తొలగించిన పాఠ్యాంశాలు చేర్చిన నూతన పాఠ్యాంశాలను పరిశీలిస్తే విద్యార్థులు ఆధునిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే భావనలన్నీ తీసివేశారు. ప్రపంచంలో ఉన్న వైవిధ్యాన్ని, వివిధ అంశాల పట్ల గల వైరుధ్యాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు.

ఆధునిక యుగం నుంచి ముందు పురోగమించవలసిన కాలంలో మధ్యయుగపు కాలానికి పాఠ్యాంశాలను తిరోగమింప చేశారు. వీటన్నిటినీ పరిశీలిస్తే విద్యార్థి స్వతంత్ర విద్యా వ్యవస్థలోకి ఒక పార్టీ నమ్మకాలు, భావాలను చొప్పించే ప్రయత్నం జరుగుతున్నది. ఇదే కనుక కొనసాగితే మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండడం కాదు కదా ఇప్పుడు ఉన్న స్థానమే దిగజారుతది.

– ఎర్రోజు శ్రీనివాస్

Exit mobile version