Site icon vidhaatha

Delhi Ordinance | ప్రభుత్వ హక్కులను హరించే.. ఢిల్లీ ఆర్డినెన్స్‌: ఆప్‌ MP రాఘవ్‌ ఛద్దా

Delhi Ordinance

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ జఠిలమైనదని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వ చట్టబద్ధమైన హక్కులను హరించి వేస్తుందని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా పేర్కొన్నారు. ఇది ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ అధికారాలను మరింత పటిష్టం చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు లేఖ రాశారు. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఈ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఛద్దా.. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బిల్లు విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, అటువంటప్పుడు ఈ బిల్లుపై రాజ్యాంగ బద్ధమైన ఏ చట్టసభలోనూ చర్చించరాదని, ఓటింగ్‌కు పెట్టకూడదని ఆయన గుర్తు చేశారు. దానిని కాదని ఏకపక్షంగా ఈ చర్యలకు పూనుకోవడం చట్ట వ్యతిరేకం, చట్టాలను అతిక్రమించటమే అవుతుందని స్పష్టం చేశారు.

మే 11న సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వ ఉన్నత అధికారుల బదిలీలపై అధికారాలు ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించిన ఛద్దా.. చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రభుత్వ అధికారులు ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారని, రాజ్యాంగబద్ధంగా ఇది సరైనదని తెలిపారు.

ఇప్పుడు ఈ బిల్లు తేవడం, దీనిపై చర్చించడం అంటే.. ఎన్నికైన ప్రభుత్వానికి చట్టబద్ధంగా లభించిన హక్కులను తిరిగి గవర్నర్‌ చేతిలో పెట్టడమేనని పేర్కొన్నారు. ఇది పరస్పర విరుద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఛద్దా తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

Exit mobile version