విధాత : తెలంగాణను అప్పులు పాలు చేసి అభివృద్ధి మాటున బీఆరెస్ నేతలు దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా కక్కిస్తామమి, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆయా శాఖల అంశాలపై జ్యూడిషియల్ విచారణలు ప్రారంభమవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీకి వెళ్లే క్రమంలో మీడియాతో మాట్లాడారు.
స్వేద పత్రం పేరుతో 50లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టామని బీఆరెస్ నేతలు చెబుతున్నారని, బావ బామ్మర్ధులు ఏమైన చెమటొడ్చి సంపాదించారా అని భట్టి ప్రశ్నించారు. అది తెలంగాణ ప్రజలు నుంచి వచ్చిన ఆదాయమన్నారు. బీఆరెస్ నేతలు అప్పులు చేసి వాళ్ల ఇష్టారాజ్యంగా రాచరికపు పోకడలతో దుబారా ఖర్చు చేశారన్నారు. వాళ్లు చేసిన అప్పులు తీర్చడానికి తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలన్నారు.
56 ఏండ్లలో కేవలం 5లక్షల కోట్లతోనే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగ్ వంటి ప్రాజెక్టులతో పాటు ఎన్నో పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, హైటెక్ సిటీ వంటి వాటిని సృష్టించుకోగలిగామని, బీఆరెస్ నేతలు చేసిన అప్పులతో కొత్తగా ఏం సాధించారని విమర్శించారు. దాదాపు 7లక్షల కోట్ల మేరకు అప్పులు చేసి కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరందించలేదని, పరిశ్రమలు తేలేదని, ఓఆర్‌ఆర్ వంటి రోడ్డు నిర్మించలేదన్నారు.
కేవలం బీఆరెస్ నాయకుల ఆస్తులు, వారి చుట్టున్న వారి ఆస్తులు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగా కాదని, ప్రజల జీవన స్థితిగతులు పెరిగితేనే నిజమైన అభివృద్ధి అన్నారు. తెలంగాణలో చెల్లించాల్సిన బిల్లులే 4.78లక్షల సంఖ్యలో ఉండగా, అందుకు సంబంధించి 40,154కోట్ల నిధులనలు చెల్లించాల్సివుందని, వారు చేసిన అప్పులు చేసి వెళ్లిపోయారని, ఇప్పుడు వాటితో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడం మా బాధ్యతగా మారిందన్నారు. కేంద్రం నుంచి నిధుల సాధనకు, విభజన హామీల అమలుకే ప్రధాని మోడీని కలువబోతున్నామన్నారు.