మోదీ పాలనలో రైతు జీవనోపాధి ధ్వంసం: విజ్జు కృష్ణ‌న్‌

రైతులు ఏకమైతే ప్రభుత్వం పతనం రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభల్లో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ విధాత: పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలను అనుసరిస్తూ.. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సందర్భంగా రెండో రోజు సోమవారం మల్లు స్వరాజ్యం నగర్ మాలి […]

  • Publish Date - November 28, 2022 / 04:01 PM IST
  • రైతులు ఏకమైతే ప్రభుత్వం పతనం
  • రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభల్లో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్

విధాత: పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలను అనుసరిస్తూ.. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సందర్భంగా రెండో రోజు సోమవారం మల్లు స్వరాజ్యం నగర్ మాలి పురుషోత్తం రెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో జరిగిన మహాసభలో పాల్గొన్నారు.

అంతకుముందు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జెండాను ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అమర వీరుల స్థూపానికి పూల మాలలు వేసి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మహాసభలకు వివిధ జిల్లాల నుండి 800 మంది రైతు నాయకులు వ‌చ్చారు. అనంతరం డాక్టర్ విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రామిక ప్రజలకు, ముఖ్యంగా రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని అన్నారు. మోదీ ప్రభుత్వం ‘అచ్చేదిన్‌’ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. ఆకృతి వైపరీత్యాలకు బడ్జెట్ నుండి నిధులు కేటాయించి నష్టపరిచారని అంచనా వేసి చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసుగల రైతులకు బీమా ప్రీమియంను ప్రవేశపెట్టిందని ఆ ప్రీమియంను 18 నుండి 70 సంవత్సరాల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

పంటల బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు జరపాలని అన్నారు. రైతు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని పేర్కొన్నారు. రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను రైతులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అంబానీ, ఆదాని వంటి బడా కార్పొరేట్‌ వ్యక్తులకు రూ.లక్షల కోట్లు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. సంపద సృష్టించే రైతులు, కౌలు రైతులను విస్మరించి దేశ సంపదను కొల్లగొట్టే వారికి మోడీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ వేస్తోందన్నారు.

వ్యవసాయ రంగాన్నిసంక్షోభంలోకి నెట్టేసి పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతుండడంతో ప్రజలంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అనుబంధ రంగాలకు చెందిన చిన్న వ్యాపారులు ఎంతోమంది ఆధారపడి ఉన్నారన్నారు. ఈ రంగం సంక్షోభంలోకి వెళ్లడం వల్ల మెజార్టీ ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని తెలిపారు.

సేద్యంలో కీలకంగా ఉన్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం దారుణమన్నారు. వీరికి కనీసం గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వడంలోనూ, వీరు ఉత్పత్తి చేసిన పంటలను కొనుగోలు చేయడంలోనూ, కనీస సదుపాయాలు కల్పించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. బడా కార్పొరేట్‌ సంస్థలకే రుణాలు అందుతున్నాయన్నారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఆర్‌బికెలు భరోసా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే లక్షన్నర మందికి కూడా సీసీఆర్‌సీలు ఇవ్వడంలేదని తెలిపారు.

కౌలు రైతుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు కనీస మద్ధతు ధర చట్టం తీసుకురావాలని, రుణవిముక్తి చట్టం, సమగ్ర వ్యవసాయం చట్టాల‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతుల గుర్తింపు జరగాలని, ఇందుకోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ సరిహద్దులో 13 నెలలపాటు జరిగిన రైతాంగ ఉద్యమం స్ఫూర్తిగా రాష్ట్రంలో కౌలు రైతులు ఉద్యమించాలని కోరారు. కౌలు రైతుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

భూయజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, నువ్వా మైదా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్, అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ నాయకులు హన్నన్ మొల్లా, సారంపల్లి మల్లారెడ్డి, ఆ మన సంఘం అధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.