Site icon vidhaatha

రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేసిన మోడీ


విధాత, హైదరాబాద్‌ : దేశంలో ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత సీడబ్ల్యుసీ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో మోడీ పదేళ్ల పాలనపై దస్‌ సాల్‌..అన్యాయ్‌ కాల్‌ అనే పేరుతో రూపొందించిన డాక్యుమెంట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విమర్శించారు. మోడీ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మోడీ లాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. భారతదేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్నారన్నారు. తన యాత్రలో రాహుల్ ప్రధానంగా ఐదు సమస్యలు పరిశీలించారన్నారు దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోందని, అలాగే, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

Exit mobile version