Karnataka | విధాత: అది కడుపు కాదు.. ఖజానా.. చదువుతుంటే ఏదో వింతగా అనిపిస్తుంది కదా..! అవును మరి ఆ వ్యక్తిది కడుపు కాదు.. ఖజానా అనే చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తి కడుపులో ఒకట్రెండు కాయిన్స్(నాణేలు) కాదు. ఏకంగా 187 కాయిన్స్ బయటపడ్డాయి. రెండు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, కాయిన్స్‌ను బయటకు తీశారు. ఈ వింత ఘటన కర్ణాటకలోని రాయచూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్‌కు చెందిన ద్యామప్ప హరిజన్(58) ఇటీవలే తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతన్ని బగల్‌కోట్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కడుపంతా ఉబ్బిపోవడంతో.. డాక్టర్లు అతనికి ఎక్స్‌రే, ఎండోస్కోపి పరీక్షలు నిర్వహించారు. కడుపులో కాయిన్స్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండు గంటల పాటు హరిజన్‌కు సర్జరీ నిర్వహించి, 187 కాయిన్స్ బయటకు తీశారు. రూ. 5 విలువ చేసే కాయిన్స్ 56, రూ.2 కాయిన్స్ 51, రూ. 1 విలువ చేసే కాయిన్స్ 80 ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న ఈ కాయిన్స్ అన్నింటిని తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.
ఈ జబ్బును స్కీజోఫ్రెనియాగా డాక్టర్లు పేర్కొన్నారు. ఈ జబ్బు ఉన్నవారు.. ఆహార పదార్థాలు కాకుండా, గడ్డి, బొమ్మలు, సుద్ద ముక్కలు, ఇతర గట్టి పదార్థాలను తింటారని వైద్యులు తెలిపారు. ఇది ఒక తిండి రుగ్మత అని చెప్పారు. నిద్ర పోరు. వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. స్కీజోఫ్రెనియా మెదడు నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.