Hairs in stomach | 62 ఏండ్ల మ‌హిళ క‌డుపులో 760 గ్రాముల వెంట్రుక‌లు తొలగింపు

Hairs in stomach | కొంత మంది ఆహారానికి బ‌దులుగా ఇత‌ర వ‌స్తువుల‌ను తింటుంటారు. ఇనుప వ‌స్తువుల‌ను మింగేస్తుంటారు. ఆ మాదిరి ఓ 62 ఏండ్ల మ‌హిళ గ‌త 50 ఏండ్ల నుంచి వెంట్రుక‌ల‌ను పీక్కుతింటుంది. చివ‌ర‌కు ఆస్ప‌త్రి పాలైంది.

Hairs in stomach | ఓ మ‌హిళ తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చేరాగా, వైద్యుల‌కు షాకింగ్ ఘ‌ట‌న ఎదురైంది. ఆ మ‌హిళ క‌డుపులో వెంట్రుక‌ల గుత్తిని చూసి షాక‌య్యారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ప‌ట్ట‌ణంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన ఓ 62 ఏండ్ల మ‌హిళ ఈ నెల 6వ తేదీన తీవ్రమైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చేరింది. వాంతులు కూడా తీవ్రంగా ఉండ‌డంతో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వైద్యులు ఆమెకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఎండోస్కోపి చేయ‌గా, ఆమె క‌డుపులో వెంట్రుక‌ల గుత్తి ఉన్న‌ట్లు వైద్యులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో నవదీప్​ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సునీల్ శర్మ పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేసి రోగి కడుపులో నుంచి ఏకంగా 760 గ్రాముల బరువు ఉన్న పెద్ద జుట్టు గుత్తిని తొల‌గించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. అయితే ఆ మహిళ కొంత కాలంగా ‘ట్రైకోఫాగియా’ అనే వ్యాధితో బాధ ప‌డుతున్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.

‘ట్రైకోఫాజియా’ అనే వ్యాధితో బాధపడుతున్న మహిళ 50 సంవత్సరాలుగా తన తల వెంట్రుకలు పీక్కొని తింటున్న‌ట్లు డాక్ట‌ర్ల విచార‌ణ‌లో తేలింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిన్న ఆహారం జీర్ణం కాక‌పోవ‌డం, వాంతులు అవ‌డం చోటు చేసుకుంటున్నాయ‌ని పేర్కొన్నారు. అయితే 35 ఏండ్ల క్రితం కూడా ఇదే మ‌హిళ క‌డుపులో నుంచి 200 గ్రాముల బ‌రువున్న వెంట్రుక‌ల గుత్తిని తొల‌గించిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.