MahabubNagar: టెక్నాలజీతో డబ్బులు రెట్టింపు చేస్తామని ఆశ చూపి.. వసూళ్లు! అంత‌ర్రాష్ట్ర ముఠాని ప‌ట్టుకున్న పోలీసులు

3 వాహ‌నాలు.. న‌కిలీ క‌రెన్సీ స్వాధీనం ప్ర‌తిభ చూపిన పోలీసుల‌ను రివార్డుల‌తో స‌త్క‌రించిన ఎస్పీ న‌ర‌సింహ‌ విధాత‌: సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వారి అత్యాశ, బలహీనతలే పెట్టుబడిగా చేసుకుని అలాంటి వారిని టార్గెట్ చేసి భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ముఠాను జడ్చర్ల సీఐ జములప్ప బృందం ఇవాళ ఉదయం మున్ననూర్ చెక్ పోస్ట్ వద్ద వల పన్ని పట్టుకున్నట్లు మహబూబ్‌న‌గర్ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మోసానికి పాల్పడ్డ ముఠాను […]

  • Publish Date - April 1, 2023 / 10:49 AM IST
  • 3 వాహ‌నాలు.. న‌కిలీ క‌రెన్సీ స్వాధీనం
  • ప్ర‌తిభ చూపిన పోలీసుల‌ను రివార్డుల‌తో స‌త్క‌రించిన ఎస్పీ న‌ర‌సింహ‌

విధాత‌: సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వారి అత్యాశ, బలహీనతలే పెట్టుబడిగా చేసుకుని అలాంటి వారిని టార్గెట్ చేసి భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ముఠాను జడ్చర్ల సీఐ జములప్ప బృందం ఇవాళ ఉదయం మున్ననూర్ చెక్ పోస్ట్ వద్ద వల పన్ని పట్టుకున్నట్లు మహబూబ్‌న‌గర్ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.

మోసానికి పాల్పడ్డ ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ.. కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి అనే వ్యక్తి ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని డబ్బుపై అత్యాశ కలిగిన అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకొని మోసాలకు తెర తీశారు.

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల వాసులతో పరిచయాలు పెంచుకొని కొంత మొత్తంలో డబ్బులు తమకు ఇస్తే తమతో ఉన్న టెక్నాలజీతో వాటిని రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికి దాదాపు 71 లక్షల మేర బాధితుల నుంచి వసూలు చేశారు.

బాధితుల డబ్బులతో పాటుగా వాహనాన్ని కూడా బలవంతంగా తీసుకెళ్లారని ఎస్పీ తెలిపారు. రెట్టింపు చేసి ఇస్తామన్న డబ్బులు కాదు కదా తీసుకున్న అసలు కూడా ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము నేర పరిశోధన చేస్తున్న క్రమంలో తెల్లవారుజామున అలాంటి ప్రయత్నంలోనే మిడ్జిల్ మండలానికి నేరస్తులు వస్తున్న క్రమంలో మున్ననూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ప‌థ‌కం ప్ర‌కారం ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

విచారణలో ఏ1 నిందితుడు రంగస్వామి బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులతో తమ స్వగ్రామంలో 4.8 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏ2 నిందితురాలు భార్గవి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి మూడు వాహనాలు 2000, 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఏ వస్తువునైన విక్రయించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అందులో కచ్చితంగా మోసపూరిత కోణం దాగి ఉంటుందని అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అనంతరం జడ్చర్ల మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందిని రివార్డుల‌తో సత్కరించారు.