విధాత: ఉమ్మడి పాలకులు చేసిన పాపం వాళ్లకు శాపమైంది. జీవితాన్ని పాతాలంలోకి తోసింది. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది.. న్యాయం చేయాలని, చీకటి బతుకుల్లో దీపం వెలిగించాలని వాళ్లు 13 ఏండ్లుగా కోర్టుల చుట్టూ.. ప్రభుత్వాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కనిపించిన ప్రతి ఒక్కరికీ దండం పెట్టి వేడుకుంటున్నారు. వాళ్లే డీఎస్సీ 2008 బాధితులు.
తాజాగా తమకు హెకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద 2008 డీఎస్సీ బాధితులు వేయి మందికిపైగా తమ కుటుంబ సభ్యులతో వచ్చి రిలే నిరహార దీక్ష చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం తమకు ఉద్యోగాలు ఇచ్చి తమ కుటుంబాలను కాపాడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని నాడు చెప్పినా..
2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీని ప్రకటించింది. దాదాపు 35 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని, కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని చెప్పింది. కానీ.. సుమారు 45 రోజుల తర్వాత 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్ 28ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. దీనిపై బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు.
నోటిఫికేషన్ విడుదలైన నెలన్నర తరువాత మార్పు చేయడం అన్యాయమని, చట్ట విరుద్ధమని వాదించారు. దీంతో కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సైతం కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27 ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
నోటి కాడి బుక్క మట్టిలో పడ్డట్టు..
అప్పటికే ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షలో బీఈడీ అభ్యర్థులు కష్టపడి మంచి మార్కులు సాధించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. అజాబితాలో తమ పేరు చూసుకొని అభ్యర్థులు మురిసిపోయారు. కొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా మొదలైంది. ఇంకొక్క రోజులో నియామక పత్రాలు అందుకుంటామని సంబరపడ్డారు. తమకు ఉద్యోగం వచ్చిందని అందరికీ చెప్పుకున్నారు. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
డైట్ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్ పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించాలని కోర్ట్ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టు విడుదల చేసి ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక దాదాపు 2000 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్ప కూలిపోయాయి.
నాటి ప్రభుత్వం చేసిన తప్పుకు వాళ్ళు బలి అయ్యారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎక్కని ఆఫీస్ లేదు.. మొక్కని నాయకుడు లేడు. 2013 జూలై 15న సుప్రీంకోర్టు బిఈడి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
సచివాలయానికి పిలిపించుకున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. బీడీ అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. దీంతో 2016 జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఈడీ అభ్యర్థుల ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారం రోజుల్లోగా సరిదిద్దాలని అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలంటూ మంజీరా గెస్ట్ హౌస్ లో సదుపాయం కల్పించాలని చెప్పారు.
ప్రతినిధుల బృందం దాదాపు వారం రోజులపాటు మంజీరా గెస్ట్ హౌస్‌లో ఉండి ఎదురు చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ హామీ అప్పుడు అమలు కాలేదు. ఆ తర్వాత ఒక సందర్భంలో వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలోను నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఉమ్మడి రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థులు చేసిన ధర్నాలకు ఆమరణ దీక్షలకు టిఆర్ఎస్ పూర్తి మద్దతు పలికింది.
అనుకూలంగా తీర్పులు ఇచ్చిన న్యాయస్థానాలు
2017 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే అప్పుడు జరిగిన వాదనల సందర్భంగా.. ఎలాంటి రిజర్వేషన్లు కల్పించకుండా కామన్ మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం తరఫున లాయర్లు కోర్టుకు చెప్పారు. దీంతో అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 27 సెప్టెంబర్ 2022న హైకోర్టు ధర్మాసనం మరోసారి బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
2008 dscలో భర్తీ చేయగా మిగిలిపోయిన పోస్టుల్లో పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1100 మంది పిటిషనర్లు ఉన్నారని అంచనా. ఏపీ ప్రాంతంలో నష్టపోయిన అభ్యర్థులకు అక్కడి ప్రభుత్వం ఏడాదిన్నర కిందట మినిమం టైం స్కేల్ పద్ధతిన నియామకాలు చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు శాశ్వతంగా ఉద్యోగాలు కల్పించడంపై అధ్యయనం చేస్తున్నది.
ఇప్పటికే తమ జీవితంలో సుమారు 13 ఏళ్ల సమయం వృధా అయిందని బీఈడీ అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని విన్నవిస్తున్నారు. హైకోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. తమ జీవితాలను నిలబెట్టి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
బాధిత అభ్యర్థులు ఇప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలతో చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ ఉద్యోగాల సాధన కోసం ధర్నాలు ఆమరణ దీక్షలు సెక్రటేరియట్ ముట్టడి వంటి కార్యక్రమాలు చేశారు. కొందరు జైల్లోకి వెళ్లారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1100 మంది అభ్యర్థులు తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో బ్రతుకుతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తమను కరుణించి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ వేడుకోలు సభ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.