NALGONDA: విస్తరిస్తున్న ఉద్యమ సెగలు! చకిలం బాటలో.. మ‌రిన్ని ఆత్మీయ సదస్సులు!

ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్న ఉద్య‌మ‌కారులు ఉమ్మ‌డి జిల్లా అంత‌టికి వ్యాపిస్తున్న నిర‌స‌న గ‌ళం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌ విధాత: తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక వ్యయ ప్రయాసలతో 14ఏళ్లు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఆత్మగౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తెలంగాణ ఉద్యమకారులు రగిలిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సొంత పార్టీ నాయకత్వం పై తమ అసమ్మతి స్వరాన్ని పెంచుతున్నారు. ఆత్మీయ సదస్సులు, ఆత్మగౌరవ సదస్సుల పేరుతో పార్టీ […]

  • Publish Date - January 28, 2023 / 03:12 PM IST
  • ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్న ఉద్య‌మ‌కారులు
  • ఉమ్మ‌డి జిల్లా అంత‌టికి వ్యాపిస్తున్న నిర‌స‌న గ‌ళం
  • సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌

విధాత: తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక వ్యయ ప్రయాసలతో 14ఏళ్లు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఆత్మగౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తెలంగాణ ఉద్యమకారులు రగిలిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సొంత పార్టీ నాయకత్వం పై తమ అసమ్మతి స్వరాన్ని పెంచుతున్నారు.

ఆత్మీయ సదస్సులు, ఆత్మగౌరవ సదస్సుల పేరుతో పార్టీ పెద్దలకు తమ అసంతృప్తిని తెలియపరిచేందుకు, ప్రజల్లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇన్‌చార్జి చకిలం అనిల్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంతో రాజేసిన సెగ క్రమంగా ఉమ్మడి జిల్లా అంతటికీ వ్యాపిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

చకిలం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైన నేపథ్యంలో అదే బాటలో జిల్లాలో మరో ఉద్యమ కేంద్రమైన వలిగొండలో రేపు ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఉద్యమ విస్తరణలో, పార్టీ అభివృద్ధిలో కీలకంగా పనిచేసి సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని, ఇతరులకు టికెట్టు ఇచ్చినా.. వారి గెలుపు కోసం పని చేసినా తొమ్మిదేళ్ల పాలనలో తగిన గుర్తింపు దక్కకపోవడం చకిలంలో అసహనానికి కారణమైంది.

ఇదే రీతిలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉద్యమకారులకు పార్టీలో తగిన పదవులు దక్కకపోవడం, ఎమ్మెల్యేల వద్ద కనీస గుర్తింపు లభించకపోవడం, అవమానాల పాలవ్వడం, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, నామినేటెడ్ పదవులైన దక్కకపోవడం వారిని అసమ్మతి వైపు నడిపిస్తుంది.

భారీగా డబ్బు ఖర్చు చేస్తేనే సభలు, సమావేశాలు విజయవంతం కాని ఈ రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సులకు మాత్రం స్వచ్ఛందంగా ఉద్యమకారులు, కార్యకర్తలు, అసంతృప్త నాయకులు హాజరవుతుండటం వారిలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తుంది.

ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం తెలంగాణ ఉద్యమకారుల సదస్సులను కవర్ చేస్తూ రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీ పైన, ప్రజల్లో ఈ సదస్సుల ప్రభావం పై ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదికలిస్తుండడం కూడా సదస్సులు సాగుతున్న తీరుపై ఆసక్తి రేపుతుంది. భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో రేపు ఆదివారం జరిగే ఆత్మీయ సదస్సు బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో జరగనుంది.

ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నాయకులతో పాటు, ఇతర పార్టీల్లోని ఉద్యమకారులను కూడా ఫోరం ఆహ్వానిస్తుంది. భువనగిరి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో అసమ్మతితో రగిలిపోతున్నారు. వారు తమ గళాన్ని వినిపించేందుకు ఉద్యమకారుల సదస్సులు వేదిక అవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రభుత్వ పెద్దలకు ఏకరువు పెట్టె ధ్యేయంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతుంది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని, సంక్షేమ పథకాల్లో 20% కేటాయించాలని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలని ఉద్యమకారుల ఫోరం సదస్సు డిమాండ్ చేస్తుంది.

అయితే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మార్చి 12న హైదరాబాద్ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుంది. ఈ రాష్ట్ర సదస్సు అనంతరం ఉద్యమకారుల ఫోరం డిమాండ్లపై ప్రభుత్వం నుండి సానుకూలత లభించకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా ఫోరం ఆందోళనలతో కూడిన ఉద్యమ కార్యాచరణ చేపట్టనుండటం గమనార్హం.

వలిగొండలో నిర్వహించే సదస్సుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పోతి జ్యోతి రెడ్డి, కన్వీనర్లు గుండేటి ఐలయ్య యాదవ్, అంజిపురం వెంకటేష్ గౌడ్ హాజరు కానున్నారు. అలాగే ఈ సదస్సుకు బీఆర్ఎస్ అసమ్మతి నేతల్లో ఎవరెవరు హాజరవుతారు అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.