సంకేతాలిచ్చిన ఎన్సీ అధినేత
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరు
అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తీరు
మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడి
శ్రీనగర్: ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి వెళ్లే అవకాశాలను ఆయన తిరస్కరించకపోవడం గమనార్హం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటుపై జమ్ముకశ్మీర్‌లోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్సీ తన సొంత బలంపై లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
ఈ విషయంలో మరో అభిప్రాయమే లేదని తేల్చి చెప్పారు. ఇండియా కూటమిలో చీలికపై గత నెలలోనే సంకేతాలు వచ్చాయి. సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చని పక్షంలో కూటమిలోని కొన్ని పక్షాలు విడిగా కూటమికట్టే అవకాశాలు ఉన్నాయని ఫరూఖ్ అబ్దుల్లా గత నెలలో పేర్కొన్నారు. గత నెలలో జమ్ము ప్రాంతంలోని ఎన్సీ ముఖ్య నాయకులు కొందరు బీజేపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు చెరో మూడు స్థానాల్లో విజయం సాధించాయి.
అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయంలో అటు కాంగ్రెస్, ఇటు ఇతర భాగస్వామ్య పక్షాలు మొండిపట్టుదలకు పోవడంతో అసలు విషయం పక్కకు పోతున్నది. ఇప్పటికే నితీశ్‌కుమార్ ఏకంగా కూటమిని మార్చి ఎన్డీయేలో చేరిపోగా, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఒంటరిగా పోటీ చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని మమతాబెనర్జీ తేల్చి చెప్పారు.
దీనిపై ఫరూక్ అబ్దుల్లా తనయుడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగమేనని, తన తండ్రి మాట్లాలను వక్రీకరించారని తెలిపారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడింటి కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. బిజెపిని ఓడించడమే ఇండియా కూటమి ఆలోచన, ఎందుకంటే రెండు పడవల్లో ప్రయాణించడం వల్ల ప్రయోజనం లేదు” అని ఆయన అన్నారు.