విధాత: కేరళకు చెందిన 46 ఏండ్ల సుభద్రవి అంతులేని కష్టాలు. గత ఆగస్టులోనే భర్త చనిపోయాడు. భర్త చనిపోవటంతో కట్టుకోవాలనుకున్న ఇల్లు మధ్యలోనే నిలిచిపోయింది. సుభద్రకు ముగ్గురు కొడుకులు. చిన్నవాడికి సెరిబ్రల్ పాల్సి అనే జబ్బు. దాంతో వాడు కదలలేడు. అతన్ని చూసుకోవటం కోసం ఆమె ఇంటి వద్దనే ఉండాల్సిన స్థితి. దీంతో పూట గడవటమే కష్టంగా మారింది. రోజుకో పూట తినటం గగనమై పోయింది.
ఓ రోజు కొడుకు అభిషేక్ చదివే స్కూలుకు పోయి ఆ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ గిరిజ హరి కుమార్‌కు తన గోడు వెళ్లబోసుకున్నది సుభద్ర. తినటానికి ఏమీ లేని దుస్థితి తమదని వాపోయింది. పిల్ల వాడు కూడా ఏమీ తినకుండానే స్కూలుకు వచ్చిన స్థితిని చెప్పి కంటనీరు పెట్టుకొన్నది. దీంతో ఉపాధ్యాయురాలు గిరిజ తన వద్ద ఉన్న వెయ్యి రూపాయలు ఇచ్చి ఆకలి తీర్చుకోండని ఇంటికి పంపింది.
కానీ గిరిజ హరికుమార్‌కు మనసు మీద మనసు లేదు. తాను చేసిన సాయం సుభద్రకు ఏ రూపంలోనూ సమస్యను పరిష్కారం చేయలేదని తలంచింది. ఏమైనా చేసి ఆమెను కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆలోచించింది. వెంటనే సభద్ర పరిస్థితిని తెలుపుతూ ఫేస్ బుక్‌లో పోస్టు చేసింది.
సుభద్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి నేరుగా ఎవరైనా సాయం చేస్తే ఆమె అకౌంటులో పడేట్లు ఏర్పాట్లు చేసింది. ఎవరైనా సాయం చేయాలనుకునే వారు సుభద్రకు సాయం చేసి ఆదుకోవాలని క్రౌడ్ ఫండింగ్‌లో కోరింది. దీంతో సుభద్ర పరిస్థితిని చూసిన ఫేస్ బుక్ ఫాలోవర్స్ విశేష స్పందన కనబర్చారు. మొన్న ఆదివారం నాటికి రూ. 55 లక్షల సహాయం అందింది.
తన చిన్న ప్రయత్నానికి పెద్ద సాయం అందినందుకు ఆమెకు అంతులేని ఆనందమేసింది. వచ్చిన డబ్బుతో సగంలోనే నిల్చిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తామని తెలిపింది. మిగిలిన డబ్బుతో పిల్లల చదువులు, కుటుంబ జీవనం కోసం, అవసరాల నిమిత్తం భద్రపరుస్తామని తెలిపింది.
సుభద్ర ఉదంతంలో దాతల స్పందన చూస్తే.. ప్రపంచంలో ఇతరుల కష్టాలను తమవిగా భావించి స్పందించే వారున్నారని రుజువు చేసింది. మనుషుల్లో మమతలు, మానవత ఇంకా బతికే ఉన్నాయని చాటి చెప్పింది.