Floods | జలకళలు.. ప్రాజెక్టుల్లోకి వరద నీరు

Floods | ఎట్టకేలకు కృష్ణమ్మలో కదలిక ఉధృతంగానే గోదారి పరవళ్లు 4 రోజుల్లో నిండుగా ఎస్సారెస్పీ మేడిగడ్డ వద్ద 75 గేట్ల ఎత్తివేత భద్రాచలం వద్ద డేంజర్‌ మార్క్‌ ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు ఆలమట్టిలోకి ప్రవాహం మొదలు నిండుకుండలా మారిన జూరాల పూర్తిగా నిండితే శ్రీశైలానికి రాక విధాత: జూలై నెల ముగింపునకు వచ్చిన దశలో ఎట్టకేలకు కృష్ణమ్మ బిరబిరా కదలింది. ఇప్పటికే గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. రెండు నదుల్లోకి నీరు వస్తుండటంతో క్రమంగా ప్రాజెక్టుల్లోకి […]

  • Publish Date - July 24, 2023 / 12:37 AM IST

Floods |

  • ఎట్టకేలకు కృష్ణమ్మలో కదలిక
  • ఉధృతంగానే గోదారి పరవళ్లు
  • 4 రోజుల్లో నిండుగా ఎస్సారెస్పీ
  • మేడిగడ్డ వద్ద 75 గేట్ల ఎత్తివేత
  • భద్రాచలం వద్ద డేంజర్‌ మార్క్‌
  • ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు
  • ఆలమట్టిలోకి ప్రవాహం మొదలు
  • నిండుకుండలా మారిన జూరాల
  • పూర్తిగా నిండితే శ్రీశైలానికి రాక

విధాత: జూలై నెల ముగింపునకు వచ్చిన దశలో ఎట్టకేలకు కృష్ణమ్మ బిరబిరా కదలింది. ఇప్పటికే గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. రెండు నదుల్లోకి నీరు వస్తుండటంతో క్రమంగా ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వాటి కారణంగా వరదలతో గోదావరి బేసిన్‌లోని ఉప నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వీటి కారణంగా గోదావరిపై ప్రాజెక్టులు నిండుతున్నాయి.

గోదావరి వరద ఉదృతి భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగుతుంది. ఇటు కృష్ణా బేసిన్‌లో కూడా జలకళ కనిపిస్తున్నది. కృష్ణ నది పరివాహకంలోని ఆలమట్టి రిజర్వాయర్లోకి క్రమంగా వరద రాక పెరుగుతున్నది. ఆలమట్టి, నారాయణపుర ఆనకట్టల్లో కనీసం వంద టీఎంసీల వరద చేరితే దిగువకు నీటి విడుదల కొనసాగనుంది.

తుంగభద్ర నదికి వరదలు పెరుగుతున్నప్పటికీ రిజర్వాయర్ నిండటానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నది. కృష్ణా ఉపనది భీమా నదికి వరదలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం బీమా ప్రాజెక్టు నుండి దిగువకు నీటి విడుదల చేసింది. సన్నతి బరాజ్‌ నుండి రెండు రోజులుగా 60 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దీంతో జూరాల ప్రాజెక్టులోకి నీటి నిల్వలు పెరుగుతున్నాయి.

జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిలువ 9.66 టీఎంసీలుగా ఉండగా తాజాగా 30,000 వేల క్యూసెక్యుల ఇన్‌ఫ్లోతో ఎనిమిది టీఎంసీలకు చేరుకుంది. జురాల గరిష్ఠ నీటి మట్టానికి చేరితే అక్కడి నుంచి శ్రీశైలానికి ప్రయాణం ప్రారంభించనుంది. ప్రస్తుతం జూరాల పవర్ హౌజ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తుండగా ఈ మేరకు దిగువకు నీటి విడుదల సాగుతున్నది.

ఘనపూర్ ప్రాజెక్టు

గోదావరిలో గరిష్ఠ మట్టానికి ప్రాజెక్టులు

గోదావరి బేసిన్‌లో ప్రస్తుత వర్షాలు, వరదలతో అన్ని ప్రాజెక్టులు క్రమంగా గరిష్ఠ మట్టానికి చేరుతున్నాయి. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్ గంగ కూడా పోటెత్తింది. గోదావరి వరదలు కాస్త తగుముఖం పట్టినప్పటికీ శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుండి 1,60,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.

ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పటికే 56 టీఎంసీలకు చేరింది. నిజాంసాగర్ 17.80 టీఎంసీలకు గాను 11 టీఎంసీలకు చేరింది. సింగూరు ప్రాజెక్టు 29.91 టీఎంసీలకు గాను 21 టీఎంసీలకు చేరింది. మధ్య మానేరు 27.50 టీఎంసీలకు గాను 16 టీఎంసీలకు చేరింది.

దిగువ మానేరులో 24.07 టీఎంసీలకు గాను 12 టీఎంసీలు దాటింది. కడెం ప్రాజెక్టులో 7.60 టీఎంసీలకు గాను ఐదు టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి 20.18 టీఎంసీలకు గాను 18.60 టీఎంసీలకు చేరింది.
నాలుగు రోజుల్లో నిండుగా ఎస్సారెస్పీ శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 1.60 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ప్రాజెక్టు నాలుగు రోజులలో నిండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎగువన నిజాంసాగర్‌కు కూడా భారీగా వరద పోటెత్తుతున్నది. దిగువన కడెం, ఎల్లంపల్లి, మేడిగడ్డ బరాజ్‌లలో వరద ఉధృతి తగ్గింది. మేడిగడ్డ బరాజ్‌కు ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా 75 గేట్లు ఎత్తారు. భద్రాచలం వద్ద 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి వద్ద హరిద్ర మంజుల గోదావరి నదుల త్రివేణి సంగమం ఉధృతంగా ఉన్నది. బంగాళాఖాతంలో ఈ నెల 24న మరో అల్పపీడనం నేపథ్యంలో ఈ నెల 25, 26 తేదీలలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నది. వీటితో కృష్ణా, గోదావరి బేసిన్‌లలో మరింత వరద ఉధృతి మరింత పెరిగి, ప్రాజెక్టులు గరిష్ఠ మట్టానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.

సింగూరు ప్రాజెక్టు

వరంగల్ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్ లు జలకళను సంతరించుకున్నాయి. ఈసారి కరువు తప్పదేమో, అనే ఆందోళన నెలకొన్న సందర్భంలో ఇటీవల కురిసిన వరుస వానలతో జిల్లాలోని భారీ మధ్య తరహా రిజర్వాయర్లోకి నీరు చేరింది. జిల్లా రైతాంగంలో ఆనందం వ్యక్తం అవుతుంది.

పెద్ద చెరువులు, రిజర్వాయర్లు పూర్తిగా నిండకపోయినప్పటికీ, వానాకాలం సాగుకు అనుకూలంగా జలాశయాల్లోకి తగినంత నీరు చేరింది. పాకాల మాదన్నపేట, రంగరాయ, రామప్ప, లక్నవరం, ఘనపురం, ధర్మసాగర్, బయ్యారం రిజర్వాయర్‌లలోకి నీరు చేరింది. గోదావరి జలాలతో కాళేశ్వరం, సమ్మక్క ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది.

వర్షాలు కొంత ఆలస్యమైనప్పటికీ దీంతో రైతులు వానాకాలం సాగు కోసం సిద్ధమవుతున్నారు. నర్సంపేట ప్రాంతంలో మాత్రం గత రబీలో నింపిన గోదావరి జలాలు నిల్వా ఉండడంతో ఇప్పటికే వానాకాలం సాగు చేపట్టారు. తాజాగా చేరిన నీరుతో వాన కాలం పంట పూర్తి అవుతుందని ధీమా రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Latest News