న్యూఢిల్లీ : పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్‌ను వదిలి అటు ఎంపీలు, ఇటు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ నలుగురు కూడా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సాగర్ శర్మ, మనోరంజన్, నీలం ఆజాద్, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ జా గత నాలుగేండ్ల నుంచి కాంటాక్ట్‌లో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఆరుగురు నిందితులు నాలుగేళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఘటనకు కొద్ది రోజుల ముందే అతికష్టం మీద పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే నిరుద్యోగం, రైతుల సమస్యలు, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస వంటి అంశాలపై తీవ్రంగా కలత చెందామని, ఈ నేపథ్యంలో ఆ అంశాలను హైలెట్ చేసేందుకే లోక్‌సభలోకి చొరబడి ఎల్లో స్మోక్‌ను వదిలినట్లు నిందితులు పోలీసుల విచారణలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుంటూ, పార్లమెంట్ భవనం వద్ద రెక్కీ నిర్వహించి, దాడికి పాల్పడ్డారు.
వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. ప్రధాని మోదీని కలవాలని, ఈ సమస్యలపై ఆయనతో మాట్లాడాలని కూడా భావిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారు. అయితే నిందితుల సమాధానాలను పోలీసులు నమ్మడం లేదు. నిందితుల ప్రధాన ఉద్దేశాలను తెలుసుకునేందుకు వారి మొబైల్స్‌ను కూడా నిశితంగా పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఫోన్లు అన్నీ లలిత్ జా వద్ద ఉన్నట్లు సమాచారం. లలిత్ జా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు లలిత్ మొబైల్ ఫోన్లతో పరారీ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
భగత్ సింగ్ మాదిరిగా బాంబు విసరాలని..
సెంట్రల్ అసెంబ్లీలోకి భగత్ సింగ్ బాంబు విసిరినట్లు మనోరంజన్ కూడా ఆ మాదిరిగానే కలర్ స్మోక్‌ను విసిరేసేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు. ఇక మనోరంజన్ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేజీని కూడా నిర్వహిస్తున్నాడు. అతనిలో విప్లవ భావాలు ఉన్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. మనోరంజన్‌కు ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అతను చదివిన పుస్తకాలే ఈ దాడులకు ప్రేరేపితం చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
చట్టసభల్లో మహిళలకు 50 శాతం కోటా ఎందుకు లేదు..?
ఇక పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేసిన నీలం దేవి కూడా భగత్ సింగ్ అభిమానే. ఆమె కూడా భగత్ సింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెజర్ల నిరసన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొని మద్దతు తెలిపింది. పార్లమెంట్ వద్ద నిరసన కంటే ఒక రోజు ముందు.. ట్విట్టర్ వేదికగా కేంద్రానికి ఆమె ఈ ప్రశ్న సంధించారు. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీలో మహిళలకు 50 శాతం కోటా ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు.