Golden Egg
విధాత: ఎవరి మాటలైనా నమ్మశక్యంగా లేనప్పుడు గాడిద గుడ్డేం కాదు! అంటాం. బాతు బంగారు గుడ్డు పెట్టింది!! అని పిల్లలకు కథలు చెప్తాం. నిజంగా బంగారు గుడ్డు ఉంటుందా! ఏ జంతువైనా బంగారు గుడ్డు పెడుతుందా! ఈ గుడ్డు గోల ఇప్పుడెందుకంటారా.. పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ అలాస్కా (Alaska) తీరంలో ఇటీవల బంగారు గుడ్డు కనిపించింది.
కచ్చితంగా బంగారు గుడ్డు కాదు కానీ, గుడ్డు ఆకారంలో బంగారు వర్ణంలో వస్తువు కనిపించింది. అది కూడా సముద్రం అడుగున 3,300 మీటర్ల లోతున (రెండు మైళ్లు) బంగారు రంగులో మెరుస్తూ ఉన్నది. దానిని చూసి ఆశ్చర్యపోయిన సముద్ర శాస్త్రవేత్తలు.. ఆ వస్తువును ల్యాబ్‌కు తీసుకొచ్చి రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర శాస్త్రవేత్తల సహాయం కూడా కోరుతున్నారు.
అసలేం జరిగిందంటే..
అమెరికాకు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా (Seascape Alaska)యాత్రలో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్నిఅన్వేషిస్తున్న సమయంలో గత నెల 30న బంగారం రంగులో మెరిసిపోతున్న బంగారు గోళం కనిపించింది.
కోడి బండమీద గుడ్డు పెడితే పగిలిపోయినట్టుగా ఆ వస్తువు ఉన్నది. 10 సెంటీమీటర్ల వెడల్పుతో గుడ్డు పగిలిన ఆకారంలో, రంధ్రం పడినట్టుగా కనిపిస్తున్నది. రిమోట్-నియంత్రిత పరికరాలను ఉపయోగించి, శాస్త్రవేత్తల బృందం ఆ వస్తువును సున్నితంగా సేకరించారు.
‘స్పూకీ గోల్డెన్ ఎగ్’ (spooky golden egg) అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నఈ బంగారు గుడ్డును అక్కడ జీవించే ఏదో ఒక జీవి పొదిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అది బంగారు గోళమా లేదా బంగారు గుడ్డా అని అంశాన్ని శోధిస్తున్నారు.