విధాత: గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఇంటిని మనం కొనుక్కుంటే ఎంత గర్వంగా ఉంటుంది? ఇప్పుడు అలానే గాల్లో తేలిపోతున్నారు ఒక వ్యక్తి. పిచాయ్ చెన్నైలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌కి వెళ్లే వరకు అక్కడి అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉండేవారు.
తాజాగా ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో తమిళ నిర్మాత, నటుడు సి.మణికందన్ దానిని సొంతం చేసుకున్నారు. ‘సుందర్ పిచాయ్ మన దేశానికి గర్వకారణం. ఆయన ఒకప్పుడు నివసించిన ఇంటిని కొనుగోలు చేయడం నా జీవితంలో ఒక గొప్ప అచీవ్‌మెంట్’ అని మణికందన్ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో పిచాయ్ తండ్రి కంటినీరు పెట్టుకున్నారని మణికందన్ గుర్తు చేసుకున్నారు. ‘వారితో మాట్లాడటానికి వెళ్లినపుడు పిచాయ్ వాళ్ల అమ్మగారు ఫిల్టర్ కాఫీ పెట్టిచ్చారు. మొదటి మీటింగ్‌లోనే వాళ్ల నాన్నగారు ఇంటి పత్రాలు చూపించారు.
అయితే ఆయనకి ఇదే మొదటి ఇల్లు కావడంతో డాక్యుమెంట్లను ఇచ్చేసే ముందు కంటనీరు పెట్టుకున్నారు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతేడాది డిసెంబరులోనే సుందర్ పిచాయ్ చెన్నైలో పర్యటించారు. ఇప్పుడు అమ్ముడుపోయిన ఇంటి బాల్కనీలో నుంచుని కుటుంబసభ్యులతో ఫొటోలు దిగారు.