మ్యూజియం ఉద్యోగి నిర్వాకం.. అప్పు తీర్చ‌డానికి అరుదైన పెయింటింగులు అమ్మేశాడు..

  • Publish Date - September 30, 2023 / 10:07 AM IST

విధాత‌: అప్పుల్లో కూరుకుపోయిన ఓ మ్యూజియం ఉద్యోగి (Museum Employee) లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ ప్ర‌ణాళిక ఒక‌టి వేశాడు. అయితే టైం బాగాలేక యాజామాన్యానికి దొరికిపోయి చిక్కుల్లో కూరుకుపోయాడు. జ‌ర్మ‌నీ (Germany) లోని మ్యూనిచ్‌లో ఉన్న ప్ర‌సిద్ధి చెందిన డాస్చెస్ మ్యూజియంలో నిందితుడు (30) ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. తీవ్ర‌మైన అప్పుల్లో కూరుకుపోవ‌డంతో వ‌చ్చిన జీతమంతా వాటికే వెళ్లిపోతోంద‌ని దిగులు చెందాడు.



 దీంతో ప‌క్కా ప్ర‌ణాళిక వేసి మ్యూజియంలోని విలువైన చిత్రాల‌ను అన‌ధికారిక వేలంలో (Sold Paintings) అమ్మేశాడు. ఆ డ‌బ్బుతో అప్పులు తీర్చేయ‌డమే కాకుండా విలాస‌వంత‌మైన వ‌స్తువుల‌ను, వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకున్నాడు. ఒకానొక రోజున ఆడిటింగ్‌లో ఈ విష‌యం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో యాజ‌మాన్యం దీనిపై విచార‌ణ జ‌రిపింది.



తాజాగా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ దొంగ‌తనాలు మే 2016 నుంచి ఏప్రిల్ 2018 మ‌ధ్య జ‌రిగాయి. ఇత‌డు దొంగ‌లించిన మొద‌టి పెయింటింగ్ పేరు ద టేల్ ఆఫ్ ద ఫ్రాగ్ ప్రిన్స్‌. ఫ్రాంజ్ వోన్ స్ట‌క్ వేసిన ఈ పెయింట్ స్థానంలో న‌కిలీది పెట్టి అస‌లైన దాన్ని వేలంలో రూ.61 ల‌క్ష‌ల‌ (74 వేల డాల‌ర్లు)కు అమ్మేశాడు. దానిని కొనుగోలు చేసిన స్విస్ గ్యాల‌రీకి ఈ పెయింటింగ్ త‌మ అమ్మ‌మ్మ తాత‌ల‌కు చెందిన‌ద‌ని చెప్ప‌డం విశేషం.


అనంత‌రం మ‌రో మూడు పెయింటింగ్‌ల‌ను మ్యూజియం నుంచి దొంగ‌లించిన‌ప్ప‌టికీ వాటిలో రెండింటిని మాత్ర‌మే నిందితుడు అమ్మ‌గ‌లిగాడు. ఎడ్వ‌ర్డ్ వ‌న్ గ్రంట్జ‌న‌ర్ వేసిన ద వైన్ టెస్ట్‌, ఫ్రాంజ్ డిఫ్రెజ‌ర్ వేసిన టు గ‌ర్ల్స్ క‌లెక్టింగ్ వుడ్ ఇన్ ద మౌంటెన్స్ అనే చిత్ర‌రాజాల‌ను అత‌డు అమ్మేశాడు. ఈ విక్ర‌యాల వ‌ల్ల అత‌డికి స‌మారు రూ.9 ల‌క్షల (12 వేల డాల‌ర్లు) మేర ల‌భించాయి.



ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స్థానిక కోర్టు తాజాగా తీర్పు వెల్ల‌డించింది. నిందితుడు త‌ప్పు చేశాన‌ని ఒప్పుకోవ‌డం, ఈ దొంగ‌త‌నాల వ‌చ్చే ప‌ర్య‌వ‌సానాల‌ను ఆలోచించ‌లేద‌ని నిందితుడు చెబుతున్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటున్నామ‌ని తెలిపింది.



దీంతో అత‌డికి రెండున్నరేళ్ల పాటు స‌మ‌యం ఇస్తున్నామ‌ని చెబుతూ సుమారు రూ.54 ల‌క్ష‌ల ( 52 వేల డాల‌ర్లు)ను మ్యూజియంకు చెల్లించాల‌ని ఆదేశించింది. నిర్దిష్ట గ‌డువులోపు చెల్లించ‌క‌పోతే జైలు శిక్ష‌కు గురికావాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించింది. అత‌డికి ఉన్న గోప్య‌తా హ‌క్కును అనుస‌రించి నిందితుడి వివ‌రాలు బ‌య‌ట పెట్ట‌వ‌ద్ద‌ని పోలీసుల‌కు, మ్యూజియంకు కోర్టు సూచించింది.

Latest News