Heavy Rains
(విధాత నెట్‌వర్క్)
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డులను బద్దలు కొడుతున్నాయి. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షం కురిసింది. 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైన, 200 కేంద్రాల్లో 10 సెం.మీ. పైన వర్షపాతం రికార్డయింది. ములుగు జిల్లా లక్ష్మిదేవి పేటలో 64 సెంటీమీటర్ల వర్షం పడగా, 2013 జూలై 19న ఇదే జిల్లా వాజేడులో కరిసిన 51 సెంటమీటర్ల వాన రికార్డు కొట్టకు పోయింది.
ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి మహోగ్ర రూపం దాల్చగా, ఉప నదులు, వాగుల ఉధృతికి పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, జనావాసాలు ముంపు బారిన పడ్డాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరంగల్ పట్టణం ముంపుకు గరైంది.
రాష్ట్రంలో భారీ వర్షాలకు తోడు ఎగువన విస్తారంగా వానలు పడుతుండటంతో పలు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అటు భారీ వరదలు, ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటితో ఎస్సారెస్పీ నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లితోపాటు బరాజ్‌లు అన్నింటా వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలిపెడుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది.
భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించి.. సహాయ చర్యలను పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. జలదిగ్బంధంలో ఉన్న మోరంచపల్లి గ్రామంలో సహాయ చర్యలకు హెలికాప్టర్లను వాడాలన్నారు.
కడెం ప్రాజెక్టు మళ్లీ ప్రమాదకరంగా మారింది. మధ్యహ్నానికే ప్రాజెక్టు గేట్ల పై నుంచి వరదనీరు పారింది. ఈ ప్రాజెక్టులో 18 గేట్లకు గాను 16 గేట్ల మీదుగా నీటిని వదిలిపెడుతున్నారు. మొదట నాలుగు గేట్లు మొరాయించినా.. సాయంత్రానికి రెండు గేట్లను అధికారులు శ్రమకోర్చి తెరిపించడంతో కాస్త ఊరట లభించింది.
ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. 25 అడుగుల నీటి సామర్థ్యాన్ని దాటడంతో దిగువ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు ఉధృతిలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం వద్ద వరదను తోడేందుకు బాహుబలి మోటర్లను వినియోగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పట్టణంలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.
ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయం.. పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు ఉంటే.. 24 అడుగుల ఎత్తున నీరు పొంగుతున్నది. దీంతో జలాశయం 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వైరా రిజర్వాయర్ అలుగు దుంకుతున్నది. మిడ్ మానేరుకు వాగుల నుండి వరద కొనసాగుతున్నది.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తి నిండగా, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పొంగడంతో కేతెపల్లిలో ప్రాజెక్టు వద్ద 7 గేట్లు ఎత్తి దిగువకు 17,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌కు శుక్రవారం కూడా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. శనివారం మొహరం, ఆదివారం సెలవులతో వరుస సెలవులు లభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో హసన్‌పర్తి-కాజిపేట మార్గంలో ట్రాక్‌పై భారీగా వరద నీరు నిల్వడంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు.
మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ విభాగం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌బాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఆ జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.
ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 61.65 సెం.మీ., ఇదే జిల్లా ఘన్‌పూర్‌లో 47.58, రేగొండలో 46.7, మొగుళ్లపల్లిలో 39.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 39, కరీంనగర్‌లోని ఇల్లందకుంటలో 38.5, హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 36.3, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 32.6, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 31.2, జయశంకర్ జిల్లా టేకుమట్లలో 31.2, హనుమకొండ జిల్లా దామెరలో 28.2, జయశంకర్ జిల్లా రేగొండలో 27.6, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 27.5, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 26.7, జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో 26.2, ములుగు జిల్లా గోవిందరావు పేటలో 25.4, వరంగల్ జిల్లా నెక్కొండలో 25.3, హనుమకొండ జిల్లా కాజీపేటలో 23.9, కరీంనగర్ జిల్లా వీణవంకలో 23.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అల్మట్టి గేట్లు తెరుచుకున్నాయి. రిజర్వాయర్‌కు 1 లక్ష 62వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా జల విద్యుత్తు కేంద్రాలకు, గేట్ల ద్వారా దిగువకు 1 లక్ష 50 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దిగువన నారాయణపుర గేట్లు కూడా ఎత్తి జురాలకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల నుండి 53 వేల క్యూసెక్కులు, హంద్రీ నుండి 150 క్యూసెక్కుల నీరు శ్రీశైలాయం జలాశయానికి చేరుకోనున్నది. తుంగభద్ర 101 టీఎంసీల సామర్థ్యానికిగాను 60 టీఎంసీలకు చేరింది.
1,11,566 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తుంగభద్రకు వస్తుండగా నాలుగురోజుల్లో జలాశయం పూర్తిగా నిండనుంది. కర్ణాటకలో భారీ వర్షాలతో కృష్ణానది, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండగా, ఆగస్టులో నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి రావచ్చని అంచనా