High Court | కస్టోడియల్‌ మరణం విచారకరం: హైకోర్టు

<p>High Court కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, మాదాపూర్‌ డీసీపీ, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా హైదరాబాద్, విధాత: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కస్టోడియల్‌ మరణం విచారకరమని, ఈ ఘటనపై వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, […]</p>

High Court

హైదరాబాద్, విధాత: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కస్టోడియల్‌ మరణం విచారకరమని, ఈ ఘటనపై వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, మాదాపూర్‌ డీసీపీ, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానా స్పదంగా మృతి చెందాడు. బిహార్‌కు చెందిన నితీశ్‌ నానక్‌రాంగూడలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడి భద్రత సిబ్బందికి, ఇతర కార్మికులకు మధ్య గొడవ జరగడంతో.. వీరంతా రెండు బృందాలుగా విడిపోయి దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో ఉన్న నితీశ్‌.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పత్రికల్లో వచ్చిన వార్తపై స్పందించిన న్యాయవాది రాపోలు భాస్కర్‌.. కస్టోడియల్‌ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

‘కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించేందుకు అర్ధ‌రాత్రి భవన నిర్మాణ కార్మికులు బయటకు వెళ్లకుండా నితీశ్‌ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజుల పాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు.

పోలీసుల చిత్రహింసల వల్లే నితీశ్‌ చనిపోయాడని పత్రికల్లో వచ్చింది. అయితే అతను గుండెపోటుతోనే చనిపోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్‌ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

Latest News