Motilal Oswal | కుటుంబాల అప్పులు పెరుగుతున్నాయి!

  • Publish Date - April 9, 2024 / 04:27 PM IST

2023 సెప్టెంబర్‌లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరిక
భారీగా పడిపోయిన పొదుపు శాతం
ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా

న్యూఢిల్లీ : దేశంలో కుటుంబాల రుణస్థాయిలు 2023 డిసెంబర్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇది జీడీపీలో 40శాతంగా నమోదైంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనాల ఆధారంగా ఈ మేరకు హిందూ ఒక వార్తను ప్రచురించింది. మొత్తంగా పొదుపు జీడీపీలో 5 శాతానికి పడిపోయాయని సదరు నివేదిక పేర్కొన్నది. ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నదనేందుకు ఇది సంకేతమని తెలిపింది.

2023 ఆర్థిక సంవత్సరానికి గాను నెట్‌ ఫైనాన్షియల్‌ సేవింగ్స్‌ ఐదేళ్ల కనిష్ఠం 5.1 శాతానికి పడిపోయినట్టు 2023 సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక పేర్కొంటున్నది. అది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2022లో 7.2శాతంగా ఉండేది. దీనికి తోడు 2022 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇంటి ఖర్చులు 5.8శాతం పెరిగాయి. అంటే.. తమ ఆర్థిక అవసరాల కోసం కుటుంబాలు అప్పులపై ఆధారపడుతున్నాయి. అయితే.. కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నది.

ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేసేందుకే కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని, అంతేకానీ ఇదేమీ ఆర్థిక సంక్షోభం తాలూకు సంకేతం కాదని చెబుతున్నది. 2022..23 ఫిబ్రవరిలో వెల్లడించిన సవరించిన తొలి జాతీయ ఆదాయ అంచనాలు కుటుంబాల పొదుపు శాతాలను 5.3శాతంగా అంచనా వేశాయి. అయితే.. ఇది కూడా 47 ఏళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. బలహీనమైన ఆర్థిక పురోగతి, అధిక ఖర్చులు, భౌతికంగా పొదుపు చేయడంలో పెరుగుదల నెట్‌ ఫైనాన్షియల్‌ సేవింగ్స్‌ను ప్రభావితం చేస్తాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక పేర్కొన్నది.

Latest News