విధాత: KBC 14 సీజన్‌కు సంబంధించి ఇటీవల విడుదలైన ఓ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఆ ప్రోమో గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఓ హౌజ్ వైఫ్ రూ. కోటి గెలుచుకుంది. కేబీసీ 14 సీజన్‌లో తొలిసారిగా రూ. కోటి గెలుచుకున్న కంటెస్టెంట్‌గా కవిత చావ్లా రికార్డు సృష్టించింది. కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలోని కోల్హాపూర్‌కు చెందిన కవిత చావ్లా గృహిణి. ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత రూ. 7.5 కోట్ల ప్రశ్నకు ఆమె సిద్ధమైంది. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి రూ.7.5 కోట్లు గెలుచుకుంటానని కవిత ధీమా వ్యక్తం చేసింది.
ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ విడుదల చేసింది. ఈ కార్యక్రమం సోమ, మంగళవారాల్లో రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా కవిత చావ్లా మాట్లాడుతూ.. కేబీసీ షోకు రావాలని 2000 సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. గతేడాది కేబీసీకి వచ్చినప్పటికీ.. ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ వద్దే ఆగిపోయాను. కానీ ఈ సారి మాత్రం రూ. కోటి గెలుచుకోవడం సంతోషంగా ఉంది. ఇక రూ. 7.5 కోట్లు గెలిచేస్తాననే నమ్మకం ఉందన్నారు.
ప్రస్తుతం గెలిచిన రూ. కోటితో తన కుమారుడిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తానని తెలిపింది. ఒక వేళ రూ. 7.5 కోట్లు గెలిస్తే మాత్రం తన కోసం ఓ బంగ్లాను కట్టించుకుంటానని చెప్పింది. ఇక ప్రపంచాన్ని చుట్టి వస్తానని కవిత తన మనసులోని కోరికలను బయటపెట్టింది. మరి ఆమె కల నిజం అవుతుందా? లేదా? అన్నది చూడాలి. రూ. 7.5 కోట్లు గెలిచిన అతి కొద్ది మంది విజేతల్లో కవిత నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.