Uttar Pradesh | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భోజనంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తప్రదేశ్ ఫిలిబీత్ జిల్లాలోని మిలాక్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు సీమాదేవి(38)తో ఏడేండ్ల క్రితం వివాహమైంది. అయితే శుక్రవారం రాత్రి సీమాదేవి తన కుటుంబ సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేసింది. ఆహారంలో తల వెంట్రుకలు కనిపించడంతో భర్త జహీరుద్దీన్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై ప్లేట్‌ను విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా తన తల్లి జులేఖా, తమ్ముడు జమీరుద్దీన్ సాయంతో సీమాదేవికి గుండు కొట్టించాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లైనప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తున్నారని, రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారని సీమాదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.