Site icon vidhaatha

BRS | హుజురాబాద్ తెరపైకి మూడో కృష్ణుడు.. పాడి టికెట్ ఆశలపై నీళ్లేనా?

BRS |

విధాత బ్యూరో, కరీంనగర్: ‘ఈ పదవి నాకు సంతృప్తికరంగా లేదు.. మీరు ఆశీర్వదిస్తే మరోసారి శాసనసభలో అడుగు పెడతా’.. అంటూ ఇటీవలి కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనల్లో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి తన అంతరంగం ఏమిటో చెప్పకనే చెబుతూ వస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ అంతా ఆయన అనుకున్నట్టే జరిగినా.. ప్రస్తుతానికైతే కథ అడ్డం తిరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుండి తన మకాంను హుజురాబాద్‌కు మార్చేస్తున్నారు. కొంతకాలంగా అధికార పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పెద్దిరెడ్డి ఆకస్మికంగా హుజూరాబాద్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం ప్రభుత్వ పెద్దల సూచనల్లో భాగమేననే వార్త గుప్పుమంటోంది.

ఆపరేషన్ హుజూరాబాద్

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు అధికార బీఆర్ఎస్ ‘ఆపరేషన్ హుజూరాబాద్’ను చేపట్టింది. కమలాపూర్ మండల కేంద్రంలో కొంతకాలం క్రితం నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు శాసనసభ సాధారణ ఎన్నికల్లో తమ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అంటూ సంకేతాలు ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది కాలానికే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఆ పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్ఠానం.. ఆ బాధ్యతను పాడి కౌశిక్ రెడ్డికి కట్టబెట్టింది.

యువకుడు, దూకుడుగా ముందుకు సాగే మనస్తత్వం కలిగిన కౌశిక్ రెడ్డి.. ఈటల రాజేందర్‌ను సమర్ధంగా ఎదుర్కొంటాడని విశ్వసించింది. 2021లో శాసనసభ్యుల కోటా కింద ఆయనకు శాసనమండలి సభ్యత్వాన్ని కట్టబెట్టింది. అది చాలదన్నట్టు ప్రభుత్వ విప్‌గా ఆయనను నామినేట్ చేసి, నియోజకవర్గం అంతటా ఆయన పెత్తనం కొనసాగేలా చేసింది. అయితే ‘ఆపరేషన్ సక్సెస్, బట్ పేషంట్ డెడ్’ అన్న చందంలా పార్టీ పరిస్థితి తయారయింది.

నోటి దురుసు కొంపముంచిందా?

గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన తరువాత కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైతే జమ్మికుంటలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ను కూల్చివేస్తానని ప్రకటించినా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఓ రైతును సిగ్గు, శరం లేదు అంటూ దూషించినా, మహిళా గవర్నర్ పట్ల అసభ్య పదజాలం ప్రయోగించినా, అన్నీ భరిస్తూ వచ్చిన బీఆర్ఎస్‌ నాయకత్వం.. ఆయనను ఇలాగే వదిలిపెడితే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భావనకు వచ్చినట్టు చర్చ నడుస్తున్నది.

తాజాగా ముదిరాజ్ కులస్తులను కౌశిక్ రెడ్డి కించపరిచిన అంశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణం అయ్యింది. ‘ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి నష్టం తప్పదని’ అధికార పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయనపై చర్యల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. ఎమ్మెల్సీ నియామకం నుండి మొదలు దశాబ్ది ఉత్సవాల వరకు కౌశిక్ రెడ్డిని వివాదాలే వెన్నాడుతూ వచ్చాయి. అవివాదాలే ప్రస్తుతం ఆయన సీటుకు ఎసరు తెస్తున్నాయనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

అమరవీరుల స్థూపం కూల్చివేత..

తెలంగాణ ఉద్యమ సమయంలో హుజూరాబాద్ ఉద్యమకారులు అమరుల స్మృత్యర్థం అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకున్నారు. తాజాగా దానిని కూల్చి వేయించిన కౌశిక్ రెడ్డి మరో స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిపై రగిలిపోతున్న స్థానిక ఉద్యమకారులు, నూతనంగా నిర్మించబోయే స్తూపం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించి ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

ఇదే కాకుండా శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కింద చేర్చడంతో మరో వివాదం తలెత్తింది. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు రువ్వి, వారి రక్తం కళ్ల చూసిన కౌశిక్ రెడ్డి అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉదయించాయి. హుజూరాబాద్‌కు చెందిన పలువురు ఉద్యమకారులు అమరుల స్థూపం కూల్చివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

దశాబ్ది ఉత్సవ ఆరోపణలు..

పార్టీ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడం, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడం లక్ష్యంతో అధికార పార్టీ ముందుకు సాగుతూ, పార్టీ నేతలను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తుండగా, హుజురాబాద్‌లో అందుకు విరుద్ధమైన పనులు జరుగుతున్నట్టు బీఆర్ఎస్ అధినాయకత్వం గుర్తించిందని చెబుతున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నియోజకవర్గంలో ‘పైసా వసూళ్ల’ వ్యవహారం పార్టీలోని పెద్దల వరకు వెళ్ళిందని సమాచారం.

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా, ఓటుకు పదివేల చొప్పున పంపిణీ చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ డబ్బును పార్టీ నేతలు సక్రమంగా పంపిణీ చేయలేదని, అందుకు సంబంధించి సమాచారం తన వద్ద ఉందని చెబుతూ ఎమ్మెల్సీ వారి వద్ద నుండి దశాబ్ది ఉత్సవాల ఖర్చులకు అయ్యే మొత్తాలను వసూలు చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దశాబ్ది ఉత్సవాలకు ఆయన పోలీసులను కూడా వదిలిపెట్టలేదని పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

హుజూరాబాద్‌పై ఇంటెలిజెన్స్ నిఘా..

దశాబ్ది ఉత్సవాల పేరిట జరిగిన వసూళ్లు, అమరవీరుల స్మారక స్తూపం కూల్చివేత, ముదిరాజ్ కులస్తులపై దూషణలు.. వీటన్నింటిపై గత రెండు రోజులుగా ఇంటిలిజెన్స్ వర్గాలు హుజూరాబాద్‌లో ఆరా తీసినట్టు సమాచారం. నేరుగా ప్రగతి భవన్ సూచన మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు అనేక మంది నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశాయని చెబుతున్నారు. అందులో చాలా మటుకు కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే సీటు గల్లంతే అన్న విషయాన్ని ధృవపరిచాయని విశ్వసనీయంగా తెలిసింది.

ఇనుగాల ఎందుకు మకాం మారుస్తున్నట్టు!

మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదవుల్లో తనకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆశించారు. కనీసం కార్పొరేషన్ స్థాయి పదవి కట్టబెట్టినా చాలని భావించారు. పెద్దిరెడ్డితో పాటే బీఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణకు శాసనమండలి సభ్యత్వం దక్కడం, హుజూరాబాద్ ఉపఎన్నిక మొదలు నేటి వరకు ముగ్గురికీ రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు, మరొకరికి శాసనమండలి సభ్యత్వం లభించడంతో, పెద్దిరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవలి హుజూరాబాద్ పరిణామాల అనంతరం పెద్దిరెడ్డి స్థానికంగా ఉన్న తన అనుచరులకు ఫోన్ చేసి, ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి అనువుగా ఉన్న ఇంటిని చూసి పెట్టాలని కోరారని సమాచారం. మరో రెండు రోజుల్లో ఆయన కుటుంబంతో సహా ఇక్కడికి మకాం మార్చబోతున్నారని తెలిసింది. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమనే సంకేతాలు ఆయన ఇచ్చారు.

ఉప ఎన్నికల సమయంలో అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ కట్టబెట్టిన బీఆర్ఎస్.. ఆ ఎన్నికలో ఓటమి అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని ప్రోత్సహిస్తూ వచ్చింది. జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ శాసనసభ ఎన్నికల్లో మూడో వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతున్నదని పరిశీలకులు అంటున్నారు.

Exit mobile version