Hyderabad Metro in betting app case: : తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు హాట్ టాపిక్ గా మారాయి. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసి అమాయక జనం మోసపోయి బలవన్మరణాలకు పాల్పడేలా పురిగొల్పుతున్నరంటూ ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పైన, టీవీ నటులు, యాంకర్ లతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులపై సైతం పోలీస్ శాఖ కేసులు నమోదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11మందిపైన, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మందిపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురికి నోటీస్ లు జారీ చేసి విచారణ సైతం ప్రారంభించారు.
అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఇరుక్కోవడమే ఆసక్తికరంగా మారింది. మెట్రో రైళ్లపైన, లోపల, స్టేషన్ లలో, ట్రాక్ ఫిల్లర్లపైన యాడ్స్ కు అనుమతించడం ద్వారా ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటుంది మెట్రో యాజమాన్యం. ఇంతవరకు బాగానే ఉన్నా బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ యాడ్స్ హైదరాబాద్ మెట్రో ప్రదర్శించడం ఇప్పుడు వివాదస్పదమైంది. ఇదే అంశాన్ని గట్టిగా పట్టుకున్న నెటిజన్లు, యూ ట్యూబర్లు ఇప్పుడు పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి నేరం చేశారని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పై, టీవీ, సినీ సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన పోలీస్ శాఖ హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ వ్యవహరంపై ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ ప్రమోషన్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి మరి పోలీస్ శాఖను నిలదీస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదంలో చొరవ తీసుకున్న టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీ.సీ.సజ్జనార్ హెదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఏ విధంగా స్పందిస్తారంటు ఎదురుచూస్తున్నారు.