Komatireddy Rajagopal Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో నాకు మంత్రి పదవి వస్తుందని నమ్ముతున్నానని..పార్టీ అధిష్టానంపై నమ్మకం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలతో ముంచెత్తారు. మునుగోడు శివాలయంలో పూజల అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం, అన్నదానం శిబిరాలను రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలలో జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డితో పాటు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణిలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ చేశారు. నిజమాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారని..ఎవరిని మంత్రి పదవి వరిస్తుందన్నది అధిష్టానం చూసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్, హరీష్ రావు ల కొట్లాటే సరిపోతుందని..ఇంకా వాళ్లు ప్రజల కోసం ఏం ఆలోచిస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికలనాటికి బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని..ఆయనను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు కట్టలేదని..రాష్ట్ర సంపదను అంతా దోచుకుతిని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చిన పది నెలలలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.