విధాత : ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వకపోతే .. సీఎం పదవే నా టార్గెట్ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ కాంగ్రెస్ మున్సిపాలిటీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో నాకు మంత్రి పదవి వస్తుంది అన్నారు. మంత్రి పదవి రాకపోతే నా టార్గెట్ సీఎం పదవే అని ప్రకటించారు. మునుగోడు మీరు చూస్కోండి.. తెలంగాణ నేను చూసుకుంటా అన్నారు. నాకు అడుక్కోవడం రాదు అని, లాక్కోవడమే నా సిద్ధాంతం అన్నారు.
పదవులు నాకు ముఖ్యం కాదని, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం నాకు మంత్రి పదవి ఇవ్వాలని, వేచి చూస్తానన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరక్టు నా టార్గెట్ సీఎం పదవే అని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యల వెనుక భారీ స్కెచ్ ఉండవచ్చంటూ జోరుగా రచ్చబండ చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో ..కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండకు కూడా మూడు మంత్రిపదవులు ఎందుకు ఇవ్వరంటూ రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే సూటి ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంతో ఆయన తన స్వరం మరింత పెంచారు. తన సోదరుడికి మంత్రి పదవి అంశంతో తనకు సంబంధం ఏంటని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు ఈ సమస్య తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఒత్తిడి పెంచుతున్న ఆశావహులు
మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల రచ్చ కొనసాగుతుండగానే..మరోవైపు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి విషయంలో చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చ రేపాయి. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి విషయంలో నా సామాజిక వర్గమే అడ్డు అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..మరో సామాజిక వర్గం నేతను గెలిపిస్తానంటూ మరోసారి మంత్రిపదవిపై మల్ రెడ్డి తన వాయిస్ వినిపించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్ లను కలిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణపై చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ వాయిస్ రేసు చేస్తున్నారని, అందుకే రాజగోపాలరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు తాజా వ్యాఖ్యల కలకలం అని పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ కొనసాగుతుంది.
వాయిదా పర్వంగా..మంత్రివర్గ విస్తరణ.. పునర్ వ్యవస్థీకరణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేస్తుండటం.. ఆయనను అసహనానికి గురి చేస్తుంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2025 జూన్‌లో వాకిటి శ్రీహరి (బీసీ ముదిరాజ్), గడ్డం వివేక్ (ఎస్సీ మాల), అడ్లూరి లక్ష్మణ్ (ఎస్సీ మాదిగ)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంలో మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంతో కొన్నాళ్లుగా మైనార్టీ వర్గానికి మంత్రి పదవి దక్కలేదన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా లంబాడీ సామాజిక వర్గం నుంచి నల్లగొండకే చెందిన దేవరకొండ ఎమ్మెల్యే ఎన్. బాలునాయక్, పీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విజయశాంతిలు రేసులో ఉన్నారు.
నిజామాబాద్ నుంచి మంత్రి పదవి ఆశించిన సీనియర్ పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంతో వారిని రేసు నుంచి తప్పించేశారు.
పునర్ వ్యవస్థీకరణ ఉంటుందా !?
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసి ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసే బదులుగా పునర్ వ్యవస్థీకరణతో పరిపాలనలో, పార్టీలో కొత్త ఊపు తేవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లుగా ప్రచారం వినిపిస్తుంది. విస్తరణ కేవలం రాజకీయంగానే కాకుండా, రాష్ట్ర పరిపాలనను మరింత చురుకుగా మార్చే దిశగా ఉండాలంటే పునర్ వ్యవస్థీకరణనే సరైందన్న వాదన వినిపిస్తుంది. పనితీరు బాగా లేని కొంతమంది మంత్రులను తప్పించి.. అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించడం, సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరించి ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వర్గాలలోని కీలకమైన ఉపవర్గాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించడం, మరికొంత మంది మంత్రుల శాఖలనూ మార్చడం బెటర్ అన్న వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
ఇన్ ఎవరో..అవుట్ ఎవరో ?
పునర్వ్యవస్థీకరణ చేస్తేనే ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులతో పాటు నలుగురైదుగురికి కొత్తగా అవకాశం దొరకనుందని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్, ఇతర పదవులనూ భర్తీ చేస్తే మరికొందరిని సంతృప్తి పరుచవచ్చన్న చర్చ సాగుతుంది. మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ జరిగితే మంత్రి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖలకు ఉద్వాసన పలకవచ్చన్న చర్చ తరుచూ వినిపిస్తుంది. అదే జరిగితే వారి స్థానంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా లేక రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి, విజయశాంతి వంటివారికి అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రిని అవుతా
– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/BBH0Yj8Avp
— Tharun Reddy (@Tarunkethireddy) February 13, 2026
