KCR |
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం
- నాడు వలసల అడ్డా…నేడు ఉపాధి గడ్డ
- దద్దమ్మనాయకులు అడ్డుకోకుంటే నాలుగేళ్లక్రితమే పూర్తయ్యేది
- కొల్లాపూర్ పట్టణాభివృద్ధి కోసం రూ.25కోట్లు మంజూరు
- పాలిటెక్నిక్ కళాశాలకు సీఎం అంగీకారం
- పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించినా
- ప్రతి నియోజకవర్గానికి వెయ్యిండ్లు ఎక్కువిస్తా
మహబూబ్‌నగర్, రంగారెడ్డి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇవాళ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలీ. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం సీఎం కేసీఆర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. స్థానికులు ఇక్కడే తమ పొలాలు పని చేసుకుంటున్నారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రం ఇది అని కేసీఆర్ తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
“తెలంగాణ ఉద్యమంలో పర్యటించినప్పుడు.. మీకు మాటిచ్చాను. రాష్ట్రం వస్తేనే సకల దరిద్రాలు మాయవవుతాయి. హక్కులు, నీల్లు వస్తాయని చెప్పాను. కష్టపడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించాను. ఇది ఒక చరిత్ర. ఈ జిల్లా కీర్తికిరీటంలో శాశ్వతంగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకుని, మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు.. కాలేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల.. ఈమూడు పూర్తయితే వజ్రం తునకలా తయారై దేశానికే అన్నం పెడుతాం.
ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. చకచక జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కూడా మూడు నాలుగేండ్ల కిందనే పూర్తయితుండే. కానీ మహబూబ్‌నగర్‌లో ఉండే గత్తర బిత్తర నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉండే దద్దమ్మ రాజకీయ నాయకులు శత్రువులు. నీల్లు అడగనిది వారే. 1975లో బచావత్ తీర్పు ఇచ్చే టైంలో మహబూబ్‌నగర్ నీళ్లు ఏవి అని అడగలేదు. బచవాత్ జడ్జిలే ఈ ప్రాంతం బాగుపడేది అని అన్నారు. 17 టీఎంసీలతో జూరాల మంజూరు చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాలు చెప్పి మేం చూపించిన చోటే కట్టాలని నిబంధన పెట్టారు.
1981 దాకా జూరాలలో తట్టెడు మట్టి తీయలేదు. సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. 2001 గులాబీ జెండా ఎగిరిన తర్వాత.. మీటింగ్ పెట్టిన తర్వాత గర్జించిన తర్వాత చంద్రబాబును ప్రశ్నిస్తే.. సమగ్రాభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే.. జూరాల కాల్వ పనులు చేయించారు. 1954లో ఆర్డీఎస్ కట్టారు. దాన్ని కూడా నాశనం చేశారు. ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్ర చేశాను. ఆంధ్రాలో ఉన్న నాయకులు కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఎస్ తూములు మూసివేస్తే మళ్లీ బాంబులు పెట్టి బద్దలు కొడుతామని చెప్పారు.
సుంకేశుల బరాజ్ వద్ద ఉండి రక్తం మరిగింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హెచ్చరించాను. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు.. అక్కడ అడుగు పెడితే.. సుంకేశుల బరాజ్‌ను 100 బాంబులు పెట్టి లేపేస్తాను అని హెచ్చరించాను. పాలమూరు ప్రజలు తప్పు తీసుకోలేదు. మాకు కూడా ఒక బాంబు వేసే మొనగాడు పుట్టిండు.. నీళ్లు వస్తాయని సంతోషపడ్డారు. మనం బాంబులు వేయలేదు. ఇంటి దొంగలే ప్రాణగండం అయ్యారు. ప్రాజెక్టు అడ్డుకున్నారు. నాటి ముఖ్యమంత్రులను చూస్తే లాగులు తడిసిపోయేవి.
పదవులకు భయపడి ఆనాడు సమైక్య పాలకులను ప్రశ్నించలేదు. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పాను. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. పాలమూరు పొంగు చూస్తూ.. కృష్ణమ్మ తాండవం చేసినట్లు ఉంటుంది. నా ఒళ్లంతా పులకరించి పోయింది. నా జీవితం ధన్యమైంది. ఒకటే పంపు వాగు పారిన రీతిలో ఉంది. కాల్వలు కంప్లీట్ కావాలి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి. నల్లగొండలోని డిండి, మునుగోడుకు నీళ్లు ఇవ్వాలి.
కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని కోరుతున్నాను. కొల్లాపూర్‌కు ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేస్తాం. రెండు, మూడు లిఫ్టలు అడిగారు. జిల్ దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవల్ కెనాల్, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్, లైనింగ్, మల్లేశ్వరం మినీ లిప్ట్ కావాలని అడిగారు. అధికారుల చేత సర్వే చేయించి మంజూరు చేస్తాను. రూ. 10 కోట్లతో బోడగట్టు చెక్ డ్యాంకు రేపే జీవో ఇస్తాం.కొల్లాపూర్ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి.. ఈ రోజు ప్రకటిస్తున్నాను. సర్పంచ్‌లకు తీపి కబురు చెబుతున్నాను.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మహబూబ్‌నగర్ పట్టణంలో పెద్దగా ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. మహబూబ్‌నగర్ పట్టణంలో కూడా జేఎన్‌టీయూ ద్వారా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. నన్ను ఎంపీగా చేసి, తెలంగాణను సాధించుకున్నారు. కాబట్టి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్ల చొప్పున ఎక్కువ ఇస్తాం. ఆర్డర్లు కూడా ఇచ్చాం. ఆ రకంగా నన్ను ఎంపీగా చేసి, తెలంగాణ సాధించేంత యోధుడిగా చేసినందుకు పాలమూరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. భవిష్యత్‌లో కూడా మీ దీవెన ఉండాలని కోరుకుంటున్నాను”.