దేశంలో ఈ ఏడాది సాధరణం కంటే అధిక వర్షాపాతం

వర్షాభావం..ఎండల ధాటి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది

  • Publish Date - April 15, 2024 / 06:10 PM IST

చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ

విధాత: వర్షాభావం..ఎండల ధాటి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నాలుగు నెలల కాలానికి దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) 87 సెంటీమీటర్లతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.

ఐఎండీ చీఫ్‌ మృత్యంజయ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1951 నుంచి 2023 వరకు ఉన్న డేటా ప్రకారం లానినా, ఎల్‌నివో సంఘటనలను అనుసరించి భారత్‌లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఇక గత నాలుగు సంవత్సరాల రుతుపవనాల సీజన్‌లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఈ సారి వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

జులై నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో ఎందలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోపక్క సాగునీరు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతుండగా, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ వర్షాపాతంపై సానుకూలంగా చేసిన ప్రకటన ప్రజలకు, రైతులకు గొప్ప ఊరటనిస్తుంది.

రానున్న నాలుగు రోజులు మరింతగా ఎండలు..తర్వాతా రెండు రోజులు వానలు

తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో ఎండలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 నుంచి 18 వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 నుంచి 20 మధ్య రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలుచోట్ల నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News