Southwest monsoon ఈ ఏడాది సాధారణ వర్షాలే.. స్కైమెట్‌ అంచనా

  • Publish Date - April 9, 2024 / 05:22 PM IST

దీర్ఘకాలిక సగటులో 102శాతం సీజనల్‌ వర్షాలు

ఎల్‌ నినో నుంచి బలమైన లా నినా వైపు..

న్యూఢిల్లీ : దేశంలో 2024 వర్షాకాల సీజన్‌ సాధారణంగానే ఉంటుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ గురువారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణంపై పోరులో కొంత స్వాంతన చేకూరుతుందని తెలిపింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) 898.6 మిల్లీ మీటర్లకు గాను 102శాతం వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీనికి ఐదు శాతం అటూ ఇటూగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ నాలుగు నెలల కాలానికి దేశ సగటు 87 సెంటీమీటర్లు. దీర్ఘకాలిక సగటులో 96 నుంచి 104 శాతం వర్షాలు కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు.

నైరుతి రుతుపవనాలపై కొద్ది వారాల క్రితమే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) 2024 సంవత్సరానికి గాను తన తొలి అంచనాలను వెల్లడించింది. 2024, జనవరి 12న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోకూడా స్కైమెట్‌.. ఈ ఏడాది వర్షాకాలం సాధారణంగానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం నెలకొని ఉన్న ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా లా నినా వైపు మళ్లుతున్నాయని వెల్లడించింది. లా నినా వాతావరణ పరిస్థితుల్లో రుతుపవనాలు బలంగా ఉంటాయి. సూపర్‌ ఎల నినో నుంచి బలమైన లా నినాకు జరిగే పరివర్తన.. మంచి వానాకాలాన్ని అందిస్తుంది. అయితే.. రాబోయే వర్షాకాలం సీజన్‌ ఎల్‌ నోనో అవశేషాల ప్రభావాల మూలంగా బలహీన రుతుపవనాలతో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని, అయితే.. సీజన్‌ రెండో భాగంలో ప్రాథమిక దశపై తిరుగులేని ఆధిక్యం చూపే అవకాశం ఉన్నదని స్కైమెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జతిన్‌సింగ్‌ చెప్పారు.

నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేసే మరో అంశమైన హిందూ మహాసముద్ర ద్విధ్రువం కూడా ఈ ఏడాది సానుకూలంగానే ఉంటుందని స్కైమెట్‌ తెలిపింది. దేశ దక్షిణ, పశ్చి, వాయవ్య ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయని పేర్కొన్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కీలకమైన వర్షాభావ ప్రాంతాల్లో కూడా తగినంత వర్షం పడుతుందని అంచనా వేసింది. తూర్పు ప్రాంతంలోని బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సీజన్‌ ప్రారంభ మాసాలైన జూలై, ఆగస్ట్‌లలో వర్షాభావ పరిస్థితులు గరిష్ఠంగా ఉంటాయని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నది. జూన్‌లో 87 సెంటీమీటర్లకు గాను 16.53శాతం వర్షాలు పడే అవకాశం ఉంటుందని, జూలైలో నైరుతి సాధారణంగా ఉండే అవకాశాలు 60శాతం ఉన్నాయని పేర్కొన్నది. జూలైలో దాదాపు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఆగస్ట్‌లో సాధారణ వర్షపాతానికి 50శాతం చాన్స్‌ ఉన్నదని, సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి 20శాతం అవకాశం ఉన్నదని స్కైమెట్‌ వెల్లడించింది. ఆగస్ట్‌లో మొత్తంగా 25.4 సెంటీమీటర్ల వర్షపాతం ఉండొచ్చని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై, ఆగస్ట్‌ నెలల్లోనే దేశంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతానికి 60 శాతం, అధిక వర్షపాతానికి 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్‌ వెల్లడించింది. మొత్తం వర్షాకాల సీజన్‌లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

Latest News