Site icon vidhaatha

Delhi | మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: స్వాతి మలివాల్‌

Delhi

న్యూఢిల్లీ: మణిపూర్‌లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యే విచారణ బృందాన్ని నియమించాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైరపర్సన్‌ స్వాతి మలివాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మధ్యంతర ప్రతిపాదనలతో కూడిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపారు. మే 4 నుంచి రగులుతున్న మణిపూర్‌లో బాధితులతో మాట్లాడేందుకు స్వాతి మలివాల్‌ గతవారం ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

హింస తీవ్రత, రెండు తెగల మధ్య స్పష్టమైన చీలిక నేపథ్యంలో రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన సర్వతరమే విధించాల్సిన అవసరం ఉన్నది. పాలన రెండు తెగలు విశ్వసించే తటస్థ వ్యక్తుల ఆధ్వర్యంలో సాగాల్సిన అవసరం ఉన్నది’ అని ఆమె పేర్కొన్నారు.

మధ్యంతర నివేదికలో పలు అంశాలను ప్రస్తావించిన స్వాతి మలివాల్‌.. ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. మణిపూర్‌ హింస, ప్రభుత్వం స్పందించిన తీరుపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నెలకొల్పాలని అన్నారు.

వీటితోపాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు వెంటనే మణిపూర్‌లో పర్యటించాలని కోరారు. మే 3వ తేదీన రాజుకున్న మణిపూర్‌ హింసలో ఇప్పటి వరకూ 150 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. మైతేయి, కుకీ తెగల మధ్య సాగుతున్న మారణహోమంలో ప్రభుత్వ వ్యవస్థలు సైతం పక్షపాతం వహిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

Exit mobile version