పాకిస్తాన్ ఎన్నిక‌ల బ‌రిలో హిందూ మ‌హిళ‌.. అస‌లు ఎవ‌రామె..?

పాకిస్తాన్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో ఓ హిందూ మ‌హిళ పోటీ చేస్తుంది. హిందూ క‌మ్యూనిటీకి చెందిన ఓ మ‌హిళ పాక్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి

  • Publish Date - December 26, 2023 / 06:50 AM IST

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో ఓ హిందూ మ‌హిళ పోటీ చేస్తుంది. హిందూ క‌మ్యూనిటీకి చెందిన ఓ మ‌హిళ పాక్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి. దీంతో ఆమె వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌స్తుతం ఆ హిందూ మ‌హిళ గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

పాకిస్తాన్‌లోని ఖైబ‌ర్ ఫఖ్తుంఖ్వా బ‌న‌ర్ జిల్లాలోని పీకే-25 స్థానానికి హిందూ మ‌హిళా, డాక్ట‌ర్ స‌వీరా ప్ర‌కాశ్ నామినేష‌న్ ప‌త్రాల‌ను డిసెంబ‌ర్ 23వ తేదీన‌ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు పాక్ మీడియా డాన్‌లో క‌థ‌నం కూడా ప్ర‌చురిత‌మైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్‌పై ఆమె బ‌రిలో దిగారు.

అస‌లు ఎవ‌రీ స‌వీరా ప్ర‌కాశ్‌..

స‌వీరా తండ్రి ఓం ప్ర‌కాశ్ భార‌తీయ మూలాలు ఉన్న వ్య‌క్తి. హిందూ సంఘాల పోరాట స‌మితి స‌భ్యుడు కూడా. ఆయ‌న బ‌న‌ర్ ఏరియాలో పేరొందిన డాక్ట‌ర్. మాన‌వ‌తా దృక్ప‌థంతో పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించే వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది. ఇక 35 ఏండ్లుగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో క్రియాశీల‌కంగా ప‌ని చేస్తున్నారు. తండ్రి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేన‌ప్ప‌టికీ, స‌వీరా బ‌రిలో నిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

స‌వీరా ప్ర‌కాశ్ అబోటాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ మెడిక‌ల్ కాలేజీలో 2022లో త‌న ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ స‌మ‌యంలోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో బ‌న‌ర్ జిల్లా నుంచి మ‌హిళా విభాగానికి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేశారు. ఇక ఓం ప్ర‌కాశ్ కూడా బ‌న‌ర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. త‌న తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌నుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు.


ప్ర‌స్తుతం స‌వీరా మహిళా సాధికార‌త కోసం ప‌ని చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని మహిళల శ్రేయస్సు, సురక్షితమైన వాతావరణం క‌ల్పించ‌డం, స్థానికులు హక్కులు కాపాడ‌టం త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. గ‌త కొన్నేండ్లుగా ముఖ్యంగా అభివృద్ది రంగంలో మ‌హిళ‌లు అణిచివేయ‌బ‌డ్డారు.. వారిని ప‌ట్టించుకోలేద‌ని స‌వీరా తెలిపారు.

Latest News