Dhurandhar | ‘ధురంధర్’: ప్రశ్నా? సమాధానమా? – భారత సినిమాకు కొత్త సవాలు

బాలీవుడ్ చాలాకాలంగా తప్పించుకుంటూ వచ్చిన వాస్తవాలను ‘ధురంధర్’ నేరుగా ప్రశ్నిస్తుంది. ఇస్లామిక్ ఉగ్రవాదం, పాకిస్తాన్ పాత్ర, జాతీయ భద్రత వంటి సున్నిత అంశాలను వాస్తవిక కోణంలో చూపిస్తూ భారతీయ సినిమా వినోదానికే పరిమితమా? అనే ప్రశ్నను ముందుకు తెస్తుంది. నచ్చినా నచ్చకపోయినా, ఈ చిత్రం ఒక చర్చను ప్రారంభించింది.

‘ధురంధర్’ సినిమాలో ఉద్రిక్తత నిండిన సన్నివేశం – జనసమూహం మధ్య ఆయుధంతో ముందుకు కదులుతున్న పాత్రలు

Dhurandhar: A Question or an Answer? How the Film Forces Indian Cinema to Confront Reality

సారాంశం
‘ధురంధర్’ ఒక స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇది ఉగ్రవాదం, జాతీయ భద్రత, ప్రాంతీయ రాజకీయాలపై భారతీయ సినిమా చాలాకాలంగా తప్పించుకున్న ప్రశ్నలను నేరుగా ఎదుర్కొంటుంది. వినోదం పేరుతో వాస్తవాలను దాచకుండా, ఇస్లామిక్ ఉగ్రవాదం ఒక ప్రపంచవ్యాప్త ముప్పు అన్న అంశాన్ని వాస్తవికతతో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. సమాధానం ఇవ్వడానికంటే, ఒక గంభీరమైన చర్చను ప్రారంభించడమే ‘ధురంధర్’ అసలైన ఉద్దేశ్యం.

(విధాత ప్రత్యేకం)

ఇటీవల బాలీవుడ్​ దర్శకుడు ఆదిత్యధర్​ తెరకెక్కించిన ధురంధర్​ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరే.. డబ్బుల మాటంటుంచితే, అది ప్రతిబింబించిన వాస్తవికత గురించే చర్చంతా. ఇంతకీ ధురంధర్​ చిత్రం పలు ప్రశ్నలకు సమాధానమే లేక తనంతట తానే ఒక ప్రశ్నా?

అదిత్య ధర్ తెరకెక్కించిన Dhurandhar ను కేవలం ఒక స్పై థ్రిల్లర్‌గా చూడటం దాని ప్రాధాన్యతను తగ్గించినట్లే. ఇది ఒక రాజకీయ–సామాజిక వాదన. భారతీయ సినిమా చాలా కాలంగా తప్పించుకుంటూ వచ్చిన నిజాలు, ఇస్లామిక్ ఉగ్రవాదం, పాకిస్తాన్ పాత్ర, జాతీయ భద్రత.. ఈ చిత్రంలో నేరుగా తెరపైకి వస్తాయి. అందుకే ఇది దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసింది.

ధురంధర్’ వినోదం కాదు – ఒక రాజకీయ, సామాజిక చర్చ

బాలీవుడ్ సాధారణంగా వాస్తవికతకు దూరంగా, పాటలు, అతిశయ కథనాలు, భావోద్వేగాలే తప్ప నిజాలు దాని బలాలు కావు. కానీ ‘ధురంధర్’ ఆ సంప్రదాయాన్ని ఛేదించి, ఉగ్రవాదాన్ని ఒక ప్రపంచవ్యాప్త ముప్పుగా, వాస్తవిక కోణంలో చూపించడానికి ప్రయత్నించింది. ఇదే ఈ చిత్రాన్ని మిగతా కమర్షియల్ సినిమాల నుంచి వేరు చేసింది.

ఈ చిత్రం పాకిస్తాన్ నేపథ్యంగా, ముఖ్యంగా కరాచీలోని లియారి ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని తీయబడింది. ఇక్కడ గ్యాంగ్ జీవితం, రాజకీయాలు, ఉగ్రవాదం ఒకదానిలో ఒకటి మిళితమైపోయిన ప్రపంచంగా చిత్రీకరించారు. ఈ నిర్మాణం చూసినవారికి అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ పోలిక సహజంగానే గుర్తుకొస్తుంది. అక్కడ బీహార్‌లోని ముస్లిం అండర్‌క్లాస్ జీవితం రాజకీయ–ఆర్థిక ఒత్తిళ్ల వల్ల నేరపథంలోకి నెట్టబడితే, ఇక్కడ లియారి యువత ఆయుధాల తయారీ, ఉగ్రవాద నియామకాల్లోకి లాగబడుతుంది. బొగ్గు గనుల స్థానంలో ఆయుధ కర్మాగారాలు. ఈ పోలిక యాదృచ్ఛికం కాదు.

‘ధురంధర్’ కథ భారత గూఢచారి ఒకరు పాకిస్తాన్ అథోజగత్తులోకి చొరబడటంతో ముందుకు సాగుతుంది. 1990ల చివరి దశకం, 2000ల ప్రారంభంలో కరాచీ రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన జాతి ఆధారిత గ్యాంగ్‌ల వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర నగరాల్లో ఒకటిగా మారిన కాలాన్ని ఈ సినిమా నేపథ్యంగా తీసుకుంటుంది. అదే సమయంలో 1999 విమాన హైజాక్‌, 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై ఉగ్రదాడులు వంటి ఘటనలను కథలోకి తీసుకురావడం ద్వారా, కల్పితం అయినప్పటికీ వాస్తవికతకు దగ్గరైన అనుభూతిని కలిగిస్తుంది.

అయితే ఇది డాక్యుమెంటరీ కాదు. ఇది కమర్షియల్​గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే బ్లాక్‌బస్టర్. కొందరు విమర్శకులు గ్యాంగ్‌స్టర్లు–ఉగ్రవాదుల మధ్య సంబంధాలను అతిశయోక్తిగా చూపించారని, కరాచీని సినిమాటిక్‌గా గ్లామరైజ్ చేశారని అభ్యంతరం చెబుతున్నారు. కానీ ఈ లోపాలు ఒక కీలకమైన మార్పును కప్పిపుచ్చలేవు. అసలు ప్రశ్న — బాలీవుడ్ ఇంతకాలం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా చూడలేదు?

దానికి సమాధానం.. రాజకీయ, సామాజిక సంకోచాలు. “ఇస్లామోఫోబియా” ఆరోపణలు రాకూడదన్న భయం వల్ల, భారతీయ సినిమాలు చాలాకాలం ఉగ్రవాదాన్ని స్పష్టంగా, వాస్తవికంగా చూపించలేదు. 2010లో వచ్చిన My Name Is Khan వంటి చిత్రాలు, ఉగ్రవాదం కన్నా ముస్లింలపై ద్వేషం ప్రదర్శించే పాశ్చాత్య సమాజాలపై దృష్టి పెట్టాయి. అది ఒక కోణం మాత్రమే. కానీ వాస్తవ ప్రమాదాన్ని చూడలేకపోవడం కూడా ఒక రకమైన అంధత్వమే.

ఉగ్రవాదమా? వాస్తవికతా?: ఊగిసలాడుతున్న భారతీయ సినిమా 

గత దశాబ్దంలో భారతదేశంలో జాతీయవాద భావజాలం బలపడింది. ఆ మార్పు సినిమా పరిశ్రమలోనూ ప్రతిఫలిస్తోంది. ‘ధురంధర్’ ఈ మార్పులో ఒక కీలక మైలురాయి. ఇది ఉగ్రవాదాన్ని పేరుపెట్టి పిలుస్తుంది. దాని మూలాలను ప్రశ్నిస్తుంది. అదే కారణంగా ఇది ప్రశంసలతో పాటు తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఇక్కడే ఒక సున్నితమైన గీత ఉంది. ఇంతకాలం ఉగ్రవాదాన్ని పట్టించుకోకపోవడం ఒక అతి అయితే, ఇప్పుడు ప్రతిదాడికి ఒకే కారణం ఉందన్న నమ్మకం మరో అతి కావచ్చు. సినిమాలో ఒక గూఢచారి అధికారి, అజిత్​ దోభాల్​(Ajit Doval)ను పోలిన పాత్ర,  “ప్రతి ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉంటుంది” అని చెప్పే మాట ఈ చర్చకు కేంద్రబిందువుగా మారింది. నిజమే, ప్రపంచంలోని అనేక ఉగ్రదాడులకు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న జిహాదీ సంస్థలే కారణమయ్యాయి. కానీ తీవ్రవాదం వైపు మళ్లేందుకు(రాడికలైజేషన్‌)కు మార్గాలు ఒక్కటే కావు. ఈ సంక్లిష్టతను విస్మరించడం కూడా ప్రమాదకరమే.

‘ధురంధర్’ ముస్లింలను మొత్తంగా దుష్టులని చిత్రించలేదు. గ్యాంగ్‌లు మతం కోసం కాదు, అధికారం కోసం, డబ్బు కోసం పనిచేస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తుంది. బలోచి గ్యాంగ్‌స్టర్ పాత్రకు ఆపాదించిన మానవీయ కోణం, ద్రోహం–దేశభక్తి మధ్య ఉన్న నైతిక సంఘర్షణ, మహిళా పాత్ర తెచ్చిన సున్నితమైన వెలుగు.. ఇవన్నీ సినిమాను పూర్తిగా బ్లాక్​ అండ్​ వైట్​గా మారనివ్వవు. ఇదే ఈ చిత్రానికి ఉన్న వాస్తవికత.

చివరికి ‘ధురంధర్’ ఒక సమాధానం కాదు. ఇది ఒక ప్రశ్న. భారతీయ సినిమా ఇంకా వినోదానికే పరిమితమా, లేక ప్రపంచ వాస్తవాలను వాస్తవికంగా చూపించే ధైర్యం తెచ్చుకుంటుందా అన్న ప్రశ్న. సమస్యను అంగీకరించడమే మొదటి అడుగు. ఆ అడుగు ధురంధర్​. అవును.. ఎవరో ఒకరు, ఎపుడో అపుడు వెయ్యాల్సిన అడుగు. అటో ఇటో ఎటో వైపు కాకుండా వాస్తవితకత వైపు ఈ సినిమా వేసింది. ఈ అడుగు వెనుక అడుగులు ఇంకెప్పుడో..

ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా — ‘ధురంధర్’ ఒక చర్చను ప్రారంభించింది. అదే ఈ చిత్రానికి ఉన్న అసలైన శక్తి.

Latest News