బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టారు. తన భర్త నుంచి గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె ముంబై కోర్టు (Mumbai court) ను ఆశ్రయించారు. అతని వల్ల తాను నష్టపోయాయని.. రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెలీన (Bollywood actor selina) తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. లైంగికంగా, శారీరకంగా వేధించారని చెప్పారు. దీంతో డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు దాఖలు చేయగా, న్యాయస్థానం పీటర్ హాగ్ కు నోటీసులు జారీ చేసింది.
ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త, హోటలియర్ అయిన పీటర్ హాగ్ ను సెలీనా 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో కవల కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కవలలకు జన్మనివ్వగా, వారిలో ఒకరు గుండె సంబంధిత సమస్యతో మరణించారు. సెలీనా జైట్లీ ప్రస్తుతం ఒకేసారి రెండు వైపులా న్యాయపోరాటం చేస్తున్నారు. గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీని అక్రమంగా అపహరించి, నిర్బంధించారంటూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
2024 సెప్టెంబర్ నుంచి నిర్బంధంలో ఉన్న తన సోదరుడి యోగక్షేమాల గురించి విదేశాంగ శాఖ సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని సెలీనా జైట్లీ ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు, ఆమె సోదరుడితో పాటు అతని భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా, సెలీనా జైట్లీ ‘నో ఎంట్రీ’, ‘అప్నా సప్నా మనీ మనీ’, ‘గోల్‌మాల్ రిటర్న్స్’ వంటి బాలివుడ్ చిత్రాలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
