Madam Zeher | చాలా మంది తాము చేసే చీకటి వ్యాపారాలను దాచేందుకు పైకి ప్రొఫెషనల్ పనులు చేస్తూ సమాజంలో మంచి వాళ్లుగా చలామణి అవుతుంటారు. తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పగలు బ్యూటీషియన్‌గా (Salon Owne) ఉంటూ రాత్రి మాత్రం డ్రగ్స్ సిండికేట్ (drug syndicate)ను శాసిస్తోన్న ఓ లేడీ డాన్ (Delhi Lady Don)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల ఢిల్లీలోని మహిపాల్‌పుర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో పోలీసులు భారీఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు ‘మేడమ్ జహర్’ (Madam Zeher) గురించి తెలిసింది. ఆ మేడమ్ గురించి కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహ అనే మహిళ ఈశాన్య ఢిల్లీ (Delhi)లో బ్యూటీపార్లర్ నడుపుతోంది. అయితే, ఆమెకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధ సరఫరాదారు బాబీ కబూతర్‌కు ఈమె అత్యంత సన్నిహితురాలుగా తేలింది.
పగలు బ్యూటీ పార్లర్ నడుపుతూ సాదాసీదాగా కనిపించే ఆమె రాత్రి పూట భారీ సిండికేట్‌నే నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సిండికేట్‌కు అవసరమైన ఆయుధాల సేకరణ, మత్తు పదార్థాల సరఫరాను ఈమె కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ వ్యాపారం బయటపడకుండా ఉండేందుకు ఆమె పగలు బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్లు గుర్తించారు. డ్రగ్ డీలర్లు ఆమెను ‘మేడమ్ జహర్’ అని పిలుస్తారట. జహర్ అంటే తెలుగులో విషం అని అర్థం.
సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు మాటువేసి ఈ లేడీ డాన్‌ను అరెస్ట్ చేశారు. బ్యూటీ పార్లర్ సాకుతో ఈమె చేసిన నెట్‌వర్క్ ఆపరేషన్ చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. ఆమెతోపాటూ ఆమె స్నేహితుడు బాబీ కబూతర్, మరో ఇద్దరిని కూడా ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ విభాగం అరెస్ట్ చేసింది. సిద్ధూ మూసేవాలా హత్యకు ముందు రెక్కీ నిర్వహించడంలో బాబీ కబూతర్‌తో కలిసి ఈమె పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల కేసులో వాడిన ఆయుధాల సరఫరాలో కూడా వీరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. బాబీ కబూతర్ అసలు పేరు మహ్‌ఫూజ్. పాక్ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న సలీమ్ పిస్టోల్ అనే అక్రమాయుధాల డీలర్ నుంచి ఇతడు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ముఠా ఆర్థిక కార్యకలాపాలు, ఇతర స్లీపర్ సెల్స్ గురించి తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Man Lights Fire At Petrol Pump | సిగరెట్ కాల్చొద్దన్నందుకు.. పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Old Tractor | లక్కీ మ్యాన్.. పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!
