విధాత, హైదరాబాద్ : అన్నదాతలకు ఆధునిక సాగు పద్దతులపై అవగాహన కల్పించేందుకు…వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక యంత్రాలను వారి దరి చేర్చే లక్ష్యంతో రైతు బడి వ్యవస్థాపకులు జూలకంటి రాజేందర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ‘రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్’ రైతాంగాన్ని ఆకట్టుకుంటుంది. రైతుబడి వ్యవస్థాపకులు రాజేందర్ రెడ్డి ఆధ్యర్యంలో అన్నదాతల కోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్’ మూడు రోజుల పాటు అట్టహాసంగా కొనసాగుతుంది. తొలిరోజు శుక్రవారం 25వేల మందికి పైగా రైతులు ప్రదర్శనను సందర్శించినట్లు రైతుబడి నిర్వాహకులు తెలిపారు. రెండో రోజైన శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వేలాది మంది రైతులు బస్సులు కట్టుకుని బయలుదేరి ఈ వ్యవసాయ యాంత్రిక ప్రదర్శనను వీక్షించేందుకు తరలివచ్చారు. అధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాల పనితీరును స్వయంగా పరిశీలించి వాటి కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన నూతన యంత్రాలపై రైతులకు నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
300కు పైగా స్టాళ్లు
రైతు బడి అగ్రి షోలో 300కు పైగా స్టాళ్లలో సాగు యంత్రాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల పనిముట్లు, సాంకేతిక పరికరాలు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనలో భాగంగా పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లు, బోరు మోటార్లు, ట్రాక్టర్ వీల్స్, పొలం వద్ద రాత్రుల్లో ఉపయోగించేందుకు టార్చిలైట్లు ఉంచారు. ఆత్యాధునిక ట్రాక్టర్లు, రొటేవేటర్లు, ట్రాన్స్ ప్లాంటర్లు, ఇతర యంత్రాలను ప్రదర్శిస్తున్నారు. వాటి పనితీరు గురించి రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డి, ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు వివరిస్తున్నారు. ప్రదర్శనలో క్రిమిసంహారక మందుల పిచికారీ చేసే డ్రోన్లు ఆకట్టుకున్నాయి. రోజుకు 50 ఎకరాల్లో పురుగుల మందును పిచికారీ చేసే డ్రోన్ల వినియోగం పట్ల రైతులు ఆసక్తి వెలిబుచ్చారు. పిచికారీ డ్రోన్ల వినియోగంతో నిరుద్యోగ యువకులు ఉపాధి సైతం పొందుతుండటంతో వాటి కొనుగోలుకు యువ రైతులు ముందుకొస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం పద్దతులు, సాగు సమాచారం యాప్ ల పనితీరును నిపుణులు రైతులకు వివరిస్తున్నారు.
నూతన టెక్నాలాజీతో సాగు లాభదాయకం : రాజేందర్ రెడ్డి
వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని రాబడి పెంచుకోవాలని రైతుబడి ఎండీ రాజేందర్ రెడ్డి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఆధునిక యంత్రాలతో సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. అధిక పెట్టబడుల సమస్యను అధిగమించడంతో పాటు సమయం ఆదా చేసుకోవచ్చన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే ఈ ప్రదర్శన ఉద్దేశమని తెలిపారు. అగ్రి షోలో పంటల సాగుతో పాటు పండ్లు, ఉద్యాన వన తోటల పెంపకం, పాడి పోషణ, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధం రంగాలలో వస్తున్న నూతన మార్పులపైన అవగాహాన, కొత్త యాంత్రీకరణ పరిజ్ఞానాన్ని రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Baby Monkey Punch : పంచ్ కోతి పిల్లకు అమ్మ దొరికింది..?
Man Lights Fire At Petrol Pump | సిగరెట్ కాల్చొద్దన్నందుకు.. పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
