పల్లెటూర్లు మన భాగ్య సీమలు..పాడి పంటలకు లోటు లేదురా..అంటూ గతంలో మన కవి, రచయితలు చెప్పిన మాటల విలువ మన దేశం కంటే..ఉరుగ్వే దేశానికి బాగా అవగతమైంది. అందుకే ఆ దేశం ఈ రోజు పాడి పంటల నినాదంతో ప్రగతి పథంలో దూసుకపోతుంది. పాడి, పంటల నినాదాన్ని విస్మరించిన మన దేశంలో మాత్రం వ్యవసాయం సమస్యాత్మకంగా మారిపోయింది. ఆవు అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భారతదేశమే. ఎందుకంటే.. ఆవును ఒక పశువుగా కాకుండా, దైవంగా కొలుస్తాం. మన ఇంట్లో ఒక మనిషిగా చూసుకుంటాం. అయితే వ్యవసాయం రంగంలో యాంత్రీకరణ, పశు పోషణపై అనాసక్తి కాస్తా దేశంలో పశు సంతతిని తీవ్రంగా దెబ్బతీసింది. అందుకు విరుద్దంగా ఉరుగ్వే దేశంలో మాత్రం మనుషుల కంటే ఆవులు ఎక్కువగా ఉండటం ఆ దేశ ప్రగతికి కీలకంగా మారింది.ఆ దేశమంతా కనుచూపు మేర పచ్చని పచ్చిక బయళ్లు, ప్రతి రైతు వద్ద ఆవులు అక్కడ సర్వ సాధారణం.

ఉరుగ్వేలో మనుషుల కంటే ఆవుల జనాభానే అధికం

ఉరుగ్వే అనే దేశం..దక్షిణ అమెరికాలోని ఓ చిన్న దేశం. దేశంలో విద్య ఉచితం. అత్యధిక అక్షరాస్యత (98.1%) ఉంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు, వైఫై సౌకర్యం కల్పించిన ప్రపంచంలోనే తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. వ్యవసాయం దృష్ట్యా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఆ దేశం నిలుస్తుంది. దేశ జనాభా కేవలం 33 లక్షలు. అయితేనేం వారి వద్ద 1 కోటి 20 లక్షల ఆవులు ఉన్నాయి. సగటున ప్రతి పౌరుని వద్ద 4 ఆవులు ఉన్నాయి. అక్కడ మీకు మనుషుల కంటే పశువులే ఎక్కువగా ఉంటాయి.

ఉరుగ్వే కుటుంబాల్లో పశుపోషణ భాగం

ఉరుగ్వే దేశంలో పెద్ద ఎత్తున పశువులు ఉండటానికి ఆ దేశ భౌగోళిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. దేశంలో అత్యధిక భాగం, అంటే దాదాపు 76 శాతం భూమిని పశుపోషణకే వాడుతున్నారు. ఈ సహజ వనరులు పశువుల పెంపకానికి అడ్డాగా, వరంగా మారాయి. క్రీ.శ.1600లలో దేశంలో పశువుల పెంపకం మొదలైంది. అప్పటినుంచి అది దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలిచింది. పశుపోషణ అనేది తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయంగా, జాతీయ గుర్తింపులో ఒక భాగంగా మారిపోయింది. “ఉరుగ్వే అంటే ఆవు, ఓడరేవు” (“Uruguay is the cow and the port”) అనే సామెత అక్కడి గ్రామీణ, పట్టణ జీవనవిధానం దేశాన్ని ఎలా నిర్వచించిందో తెలియజేస్తుంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే పశు సంపదలో బీఫ్ (గొడ్డు మాంసం) కూడా ఆ దేశపు ప్రధాన ఎగుమతుల్లో ఒకటిగా నిలవడం విస్మరించేలేని చేదు వాస్తవం. బీఫ్ ఎగుమతులతో ఉరుగ్వే ఏటా బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం పొందుతుంది.

పశు పోషణలో ఆధునిక టెక్నాలాజీ

ఉరుగ్వే దేశంలో పశుపోషణ పూర్తిగా సాంకేతిక వినియోగం ఆధారంగా సాగుతుండుటం గమనార్హం. ప్రతి పశువును ట్రాక్ చేయడానికి 100 శాతం ఎలక్ట్రానిక్ ట్రేసబిలిటీ టెక్నాలజీని తీసుకొచ్చిన మొదటి దేశాల్లో ఇది ఒకటి. అంటే ప్రతి పశువు పుట్టినప్పటి నుంచి మాంసంగా మారే వరకు దానికి ఒక ట్యాగ్ వేసి ట్రాక్ చేస్తారు.
ప్రతి ఒక్క ఆవు చెవికి ఎలక్ట్రానిక్ చిప్ బిగించి ఉంటుంది. దాని కారణంగా ఆ ఆవు ఎక్కడ ఉందో..దాని ఆరోగ్య స్థితి ఏమిటో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు. ఆ దేశంలో రైతు యంత్రం ద్వారా పంటను కోస్తు ఉండగానే.. ఆ యంత్రం మరో పక్కన ఆ ధాన్యం పరిమాణం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ పరిమాణం ఆధారంగా రైతు ప్రతి చదరపు మీటరుకు ఎంత పంట పండిందో స్వయంగా విశ్లేషణ చేసుకుంటాడు.

ప్రభుత్వ పర్యవేక్షణలోనే పంటల సాగు,పశు పోషణ

2005 సంవత్సరంలో 33 లక్షల జనాభా గల దేశం 99 లక్షల మందికి సరిపడేంత పంట పండించింది. ఇప్పుడు 2కోట్ల 80 లక్షల మందికి సరిపడేంత పంటను తీస్తుంది. ఉరుగ్వే దేశం యొక్క ఈ ప్రగతి వెనుక పశు పోషకులు, రైతులు శతాబ్దాల తరబడి చేసిన పరిశోధన కీలక భూమిక పోషించింది. వ్యవసాయాన్ని పర్యవేక్షించేందుకు 500మంది వ్యవసాయ రంగ నిపుణులు డ్రోన్లు, శాటిలైట్ ద్వారా నిరంతరం రైతులను గమనిస్తూ ఉంటారు. వారు సూచించిన ప్రకారమే రైతులు తమ పనులు కొనసాగిస్తుంటారు. ఆధునిక సాంకేతికత సహకారంలో పశు పోషణ ద్వారా వారి జనాభా కంటే కూడా ఎన్నో రెట్లు పాలు, పెరుగు, నెయ్యి, వెన్నతో పాటు ఎన్నో రెట్లే అధికంగా పంటలు పండించడం చేస్తున్నారు. అందుకే వాటి ఎగుమతి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. ప్రతి రైతు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పంటలు, పశు మాంసంతో లక్షల్లో ఆదాయం పొందుతాడు. ఒక రైతు కనీస ఆదాయం ప్రతి నెలకు రూ. 1,20,000. సంవత్సరానికి 190000డాలర్లు కావడం విశేషం.

పాడి పంటల ప్రగతిలో స్ఫూర్తి దాయకం

ఆ దేశం యొక్క జాతీయ చిహ్నం సూర్యుడు. జాతీయ ప్రగతి చిహ్నం ఆవు, గుర్రం. ఉరుగ్వే లో ఆవును చంపితే వెంటనే మరణ శిక్ష అనే చట్టం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సర్టిఫై చేసిన వాటినే బీఫ్ కోసం వినియోగిస్తారు. విశేషం ఏమిటంటే ఉరుగ్వే దేశం గో సంపదంతా భారతీయ సంతతికి చెందినదని భావిస్తుంటారు. అందుకే వాటిని ‘ఇండియన్ కౌ ‘ అని సంబోధిస్తూ ఉంటారు. అయితే గోవులను పూజించే భారత్ లో మాత్రం గో హత్య నివారణ చట్టాలు అమలు లేకపోవడం విచారకరం. వ్యవసాయ ఆధారిత భారత దేశం తనలోని ఓ జిల్లా అంతటి చిన్న దేశమైన ఉరుగ్వే నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.