లక్నో: ఓ యువకుడిని నాగుపాము కాటేసింది. ఆ పామును బంధించిన యువకుడు సంచిలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో సోమవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్ పరిధిలోని ఫతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడు సూట్ ధరించి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తాను ఇంట్లో ఉండగానే నాగుపాము అతన్ని కాటేసింది. ఇక ఆ పామును సంచిలో బంధించాడు. పామును తీసుకొని బైక్‌పై మీర్జాపూర్ డివిజనల్ ఆస్పత్రికి వెళ్లాడు.
అక్కడ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లి, పామును బెడ్‌పై వదిలేశాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాక్టర్లు అతనికి యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక బెడ్‌పై వదిలేసిన పామును మళ్లీ సంచిలో బంధించి, ఆ తర్వాత సమీప అడవుల్లో వదిలేశారు.