మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన యూకే యువ‌త‌.. ఉద్యోగాల‌కు 5 ల‌క్ష‌ల మంది దూరం!

యునైటెడ్ కింగ్‌డ‌మ్ (UK) యువ‌త ఎక్కువ‌గా మాన‌సిక స‌మ‌స్య బారిన ప‌డుతోంద‌ని తాజా అధ్య‌య‌నం ఒక‌టి వెల్ల‌డించింది

  • Publish Date - December 25, 2023 / 10:59 AM IST

యునైటెడ్ కింగ్‌డ‌మ్ (UK) యువ‌త ఎక్కువ‌గా మాన‌సిక స‌మ‌స్య బారిన ప‌డుతోంద‌ని తాజా అధ్య‌య‌నం (Study) ఒక‌టి వెల్ల‌డించింది. గ‌త నాలుగేళ్ల‌లో సుమారు 5 ల‌క్ష‌ల పైబ‌డి యువ‌త ఈ కార‌ణంగానే ఉపాధిని ద‌క్కించుకోలేక‌పోయార‌ని పేర్కొంది. యూకే నేష‌న‌ల్ స్టాటిస్టిక్స్ వెలువ‌రించిన నివేదిక ప్ర‌కారం.. 2023లో మొద‌టి త్రైమాసికం స‌మయానికి 5,60,000 మంది ఉద్యోగాల‌కు దూరంగా ఉన్నార‌ని తేలింది. వీరంతా 16 నుంచి 34 ఏళ్ల మ‌ధ్య వారే కావ‌డం గ‌మ‌నార్హం.


దీనికి కార‌ణం చాలా మంది యువ‌త మాన‌సిక ఒత్తిడితో స‌త‌మ‌తం కావ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ది గార్డియ‌న్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఆర్థిక వ్య‌వ‌స్థ పెరుగుతున్న‌ప్ప‌టికీ మాన‌సిక వైద్యానికి ప్ర‌భుత్వాలు నిధులు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఈ ప‌రిస్థితికి దారి తీసింద‌ని వారు చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం 45 నుంచి 54 ఏళ్ల మ‌ధ్య వ‌యస్కుల వారు ఎలా ప్ర‌వ‌ర్తించేవారో ఇప్ప‌టి 16 – 34 ఏళ్ల వారు అలా ఆలోచిస్తున్నార‌ని హెల్త్ ఫౌండేష‌న్ అభిప్రాయ‌ప‌డింది.


వీరిలో 36 శాతం మంది ఒత్తిడి, ఆందోళ‌న‌, న‌రాల బ‌ల‌హీన‌త‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపింది. 12 ఏళ్ల పాటు మాన‌సిక వైద్య రంగంలో ప్ర‌భుత్వం ఎలాంటి పెట్టుబ‌డులూ పెట్ట‌లేదు. రోగుల‌ను స్వ‌స్థుల‌ను చేయాల‌ని ప్ర‌య‌త్నించారే త‌ప్ప జ‌నాభా అంత‌టినీ ఆరోగ్యంగా ఉంచాల‌నే దృష్టి వారికిలేదు అని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఎక్సెట‌ర్ అండ్ ఛైర్ ఆఫ్ బ్రిటిష్ మెడిక‌ల్ అసోసియేష‌న్ బోర్డ్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెస‌ర్ డేవిడ్ స్ట్రెయిన్ అభిప్రాయ‌ప‌డ్డారు.


ప్ర‌స్తుతం యూకేలో నేష‌న‌ల్ డిసీజ్ స‌ర్వీస్ ఉందిగానీ నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ లేద‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా యువ‌త‌లో మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు కొవిడ్ కూడా కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఉద్యోగాలు చేసేవారిలో మెంట‌ల్ డిస్ట‌ర్బెన్స్‌కు గురయ్యే వారి సంఖ్య 2011లో 6.7 శాతం ఉండ‌గా.. 2023లో అది 12.7 శాతానికి పెరిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Latest News